అందమైన ఆ ఊరు.. ప్రశాంతతకు చిరునామా. కాలుష్యం లేని గాలి పీల్చాలన్నా, రణగొణ ధ్వనుల నుంచి కాస్త ఊరట కావాలన్నా ఆ ఊరికి వెళ్లాల్సిందే. అదే.. ఇరాన్లో ఉన్న చిన్న గ్రామం మజిచల్. కొండలు, లోయలు, పచ్చదనం, రంగురంగుల పూల సోయగాలు... ప్రకృతితో ముడిపడిన పల్లె జీవనం.. ఇలాంటి అద్భుతాలను చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. ఆ అందమైన పల్లెటూరి గురించి మరెన్నో సంగతులు ఇవి.
మజిచల్.. ఇరాన్‌కు ఉత్తరాన ఉన్న మజాందరన్ ప్రావిన్స్‌లోని కెలార్దష్ట్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని ప్రకృతి ఒడిలో ఒదిగిన అందమైన గ్రామం అది. ఈ గ్రామంలో తారు రోడ్లు, సెల్ఫోన్లు వంటి ఆధునిక సౌకర్యాలు లేవు. కానీ, నగర కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు గొప్ప ప్రదేశం. ఎక్కువ జన సంచారం కూడా ఉండదు. ప్రకృతితో మమేకమై రెండు మూడు రోజులు అలా సేదదీరొచ్చు.
మజిచల్ అంటే..
ఈ ఊళ్లో చెస్ట్ నట్ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మజిచల్ అనే పేరు వచ్చింది. ఎందుకంటే లోకల్ భాషలో మజీ అంటే చెస్ట్నట్, చల్ అంటే లోయ. కాబట్టి మజిచల్ అనే పేరు చెస్ట్నట్ చెట్లతో నిండిన లోయ ప్రాంతాన్ని సూచిస్తుంది.
ఆ ఊళ్లో మొత్తం కుటుంబాల సంఖ్య వంద వరకు ఉండొచ్చు. వాళ్లలో ఎక్కువ మంది రైతులు లేదా పశువుల పెంపకందారులు. వీళ్లంతా వేసవిలో మాత్రమే ఎక్కువగా గ్రామంలో నివసిస్తారు. శీతాకాలం వచ్చేసరికి తక్కువ ఎత్తుకు వలస వెళ్తుంటారు. వేసవిలో అబ్బాసాబాద్ గ్రామానికి చెందిన రైతులు తమ పశువులకు మేత కోసం మజిచల్కి వెళ్తుంటారు. అలాంటప్పుడు గొర్రెల మందలు మజిచల్ వైపు మట్టి రోడ్ల మీద తిరగడాన్ని చూడొచ్చు.
మజిచల్ గ్రామం ఏడాది పొడవునా టూరిస్ట్‌లను అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. ఒకే రోజులో వాతావరణం, ఎండ నుంచి భారీ వర్షంగా మారిపోతుంది. అంతేకాదు, వర్షం కురిసినప్పుడు మజిచల్ మేఘాల మీదుగా తేలుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఉదయం పొగమంచు, చల్లని గాలి వీస్తోంటే.. పొయ్యి మీద వేడి వేడిగా రొట్టెలు కాలుస్తుంటారు. మజిచల్ నివాసులు అప్పుడే కాల్చిన రొట్టెలను వేడి టీ, పెరుగు, క్రీమ్ వంటి వాటితో తింటారు.
అట్రాక్షన్స్
మజిచల్ గ్రామం సముద్ర మట్టానికి 2,600 కిలో మీటర్ల ఎత్తులో ఉంది. ఆ ఊరికి వెళ్లే దారిలో వెహికల్స్ నడపడం కష్టమే. అందుకని చాలామంది టూరిస్ట్‌లు వాళ్ల కార్లను ఊరి బయటే వదిలేసి వెళ్తుంటారు. చెస్ట్నట్, ఓక్ వంటి చెట్లు ఉన్న అడవి దారిలో వెళ్తే కేలంద్రష్ట్ నుంచి మజిచల్కి ఒక గంట పడుతుంది. చాలామంది టూరిస్ట్‌లు, ట్రెక్కింగ్ చేస్తూ మజిచల్కి వెళ్తుంటారు. అడవి దాటాక, ఎత్తైన ప్రదేశాలు కనిపిస్తాయి. అడవికి, మజిచల్కి మధ్య కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవి అడవి జంతువులు ఊళ్లోకి రాకుండా కాపాడతాయి.
ఈ ప్రాంతంలోని నేల రకం రాస్ప్బెర్రీస్, ప్రూనే, యాపిల్స్, బేరి, హాజెల్ నట్స్, బ్లూబెర్రీస్, పోప్లర్, మాపుల్, అనేక ఇతర రకాలైన చెట్లు, పొదలు ఉన్నాయి. ఎలుగుబంట్లు, తోడేళ్ళు, మారల్స్, జింకలు, పందులు, నక్కల వరకు చాలా రకాల జంతువులు కనిపిస్తాయి. వేటాడే పక్షుల నుండి అందమైన పెంపుడు పక్షుల వరకు వివిధ రకాల పక్షులతో మజిచల్ కళకళలాడుతుంటుంది. అస్తారా నుంచి గోర్గాన్కు తూర్పున మజిచల్ ఫారెస్ట్ ఉంది. దీని పొడవు 800 కిమీ, వెడల్పు110 కిమీ. చాలా మంది మౌంటెనీర్స్, ప్రొఫెషనల్ హైకర్లు శీతాకాలంలో మజిచల్కి వెళ్లడానికి ఇష్టపడతారు.
ఈ ఊళ్లో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. కొండలు, పర్వత ప్రాంతాలు రంగు రంగుల పూలతో నిండి ఉంటాయి. మజిచల్లో ఏటా పూల పండుగ జరుగుతుంది. అది చూసేందుకు కన్నుల విందుగా ఉంటుంది. ఇరాన్ ఉత్తర భాగంలో పెరిగే అరుదైన పువ్వుల్లో ఒకటైన లిలియాసి, మజిచల్లోనే పెరుగుతుంది. పూల పండుగలో ఆ పూలను చూడొచ్చు.
సమ్మర్ స్పెషల్
మజిచల్లో ఒక గది, పైకప్పుతో ఒక ఇల్లు ఉంటుంది. దాన్ని ‘బుర్జ్’ అంటారు. అంటే టవర్ అని అర్థం. దాన్ని సమ్మర్ యాక్టివిటీస్ కోసం వాడతారు. స్ర్పింగ్, సమ్మర్ సీజన్స్‌లో మజిచల్ వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు.
హోటల్స్ ఉండవు
ఈ ఊళ్లో హోటల్స్, గెస్ట్ హౌస్‌లు ఉండవు. ఒకవేళ స్టే చేయాలనుకుంటే దగ్గర్లో ఉన్న కేలంద్రష్ట్, అబ్బాస్ అబాద్ ప్రాంతాల్లో ఉన్న హోటల్స్‌కి వెళ్లాలి. కేలంద్రష్ట్లో ఒక షాప్, గ్యాస్ స్టేషన్ ఉన్నాయి. అవసరమైతే కేలంద్రష్ట్లో ఫుడ్, నీళ్లతోపాటు ఫ్లాష్ లైట్స్, బొగ్గు, కట్టెలు, వండుకోవడానికి కావాల్సిన వస్తువులు వంటివి తీసుకుని మజిచల్ వెళ్లాలి.