ప్రకృతి ఒడిలో సేదతీరాలని, అడవిజంతువులు, రంగురంగుల పక్షుల్ని చూడాలని ఉందా...! పాలనురగలా కిందకు దుమికే జలపాతం అందాల్ని రెప్పవాల్చకుండా చూడాలి అనిపిస్తోందా..! వీటన్నింటినీ ఒకే దగ్గర చూడాలంటే మంచిర్యాల జిల్లాకు వెళ్లాల్సిందే. ఇక్కడికి వెళ్తే గోండు రాజుల కాలానికి గుర్తుగా ఎర్రని ఇసుక రాళ్ల మీద ఉన్న గాంధారి ఖిల్లాని చూసి రావొచ్చు. ‘తెలంగాణ అన్నవరం’గా పేరొందిన గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది ఇక్కడే. బొగ్గు గనులు, థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్న మంచిర్యాలకి వీకెండ్ టూర్ వెళ్తే మస్త్ ఎంజాయ్ చేయొచ్చు.
వైల్డ్‌లైఫ్ శాంక్చురీలకు మంచిర్యాల జిల్లా పాపులర్. వాటిలో గోదావరి ఉపనదుల్లో పెద్దదైన ప్రాణహిత నది ఒడ్డున ‘ప్రాణహిత వైల్డ్‌లైఫ్ శాంక్చురీ’ ఉంది. 136 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ శాంక్చురీలో టేకు చెట్లు ఎక్కువ. ఈ ప్రాంతంలోని వన్యప్రాణులు, పక్షులు, రకరకాల చెట్లని కాపాడాలనే ఉద్దేశంతో 1994లో దీన్ని వైల్డ్‌లైఫ్ శాంక్చురీగా ఏర్పాటు చేశారు. కృష్ణ జింకలకు ఈ శాంక్చురీ ఫేమస్. ఇక్కడికి వెళ్తే ఈ జింకలతో పాటు 20 రకాల వన్యప్రాణులు, రకరకాల పక్షుల్ని చూడొచ్చు. నవంబర్ నుంచి ఏప్రిల్ నెలల మధ్యలో వెళ్తే పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్లేస్‌లో ఎంజాయ్ చేయొచ్చు.
గోండు రాజుల గాంధారి కోట
దీన్ని గాంధారి ఖిల్లా అంటారు. వెయ్యేండ్ల చరిత్ర ఉన్న ఈ కోట మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట ఊరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. గోండు రాజులు దీన్ని కట్టించారట. కోట లోపల రాళ్ల గోడల మీద చెక్కిన కాలభైరవుడు, శివుడు, గణపతి, ఆంజనేయుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ మూడు బావులు ఉంటాయి. వాటిలో ఒకటైన ఏనుగుల బావిలో నీళ్లు తాగేందుకు ఒకప్పుడు ఏనుగులు, గుర్రాలు ఇక్కడికి వచ్చేవని చెప్తారు అక్కడి వాళ్లు. రెండేండ్లకు ఒకసారి మాఘమాసంలో ఈ కోటలోని మైసమ్మ గుడిలో పెద్ద జాతర జరుగుతుంది. అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి కూడా గిరిజనులు పెద్ద సంఖ్యలో వస్తారు. అలాగే ప్రతి ఏడాది ఇక్కడ మహంకాళి జాతర ఘనంగా జరుగుతుంది.
శివ్వారం శాంక్చురీ
గోదావరి నది పారే ప్రాంతంలో ఉన్న ఈ శాంక్చురీలో మార్ష్ జాతి మొసళ్లు ఎక్కువ. మంచినీళ్లలో ఉండే వీటిని ‘మగ్గర్ మొసళ్లు’ అని కూడా పిలుస్తారు. ఈ మొసళ్లను కాపాడాలనే ఉద్దేశంతోనే దీన్ని శాంక్చురీ చేశారు. ఇది 32 చదరపు కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంటుంది. తెల్లమద్ది, నల్లమద్ది, నల్లకొడిశ వంటి ఔషధ మొక్కలు ఉంటాయి. ఎలుగుబంటి, చిరుతపులి, లంగూర్ కోతులు, మకాక్ జాతికి చెందిన రీసస్ కోతులు ఇక్కడ కనిపిస్తాయి. బోటు షికారు కూడా చేయొచ్చు.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్
జైపూర్ మండలంలోని పెద్దపల్లి గ్రామంలో ఉంది సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్. 1200 మెగావాట్ల కరెంట్ తయారుచేసేందుకు దీన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ 600 మెగావాట్ల యూనిట్లు రెండు ఉంటాయి. దీన్ని సింగరేణి కాలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతోంది. మంచిర్యాలకు దగ్గర్లోనే రవీంద్రఖని బొగ్గు గని ఉంది. ఇదేకాకుండా ఇక్కడ ఐదు బొగ్గు గనులు ఉన్నాయి.
ఇలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి 245 కిలోమీటర్ల దూరంలో ఉంది మంచిర్యాల. మంథని నుంచి 10 కిలోమీటర్లు జర్నీ చేస్తే శివ్వారం శాంక్చురీ చేరుకోవచ్చు. మంచిర్యాల నుంచి గాంధారి కోటకు 12 కిలోమీటర్ల దూరం. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కి వెళ్లాలంటే మంచిర్యాల నుంచి 60 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ప్రాణహిత శాంక్చురీ మంచిర్యాల నుంచి 35 కిలోమీటర్ల దూరం.
కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ
ఇది జిన్నారం మండలంలో ఉంది. అడవి జంతువులు, రకరకాల పక్షులు, దట్టమైన చెట్లతో అడవిని తలపించే ఈ ప్రాంతాన్ని 1965లో వైల్డ్ లైఫ్ శాంక్చురీగా చేశారు. అయితే పులుల సంఖ్య పెంచాలనే ఆలోచనతో 2012లో దీన్ని ‘పులుల సంరక్షణ కేంద్రం’గా మార్చారు. ఈ శాంక్చురీ గుండా ప్రవహించే గోదావరి, కడెం నది, పెద్దవాగు కారణంగా ఇక్కడి నేలంతా పచ్చగా ఉంటుంది. సఫారీ రైడ్‌కి వెళ్తే పులులు, చిరుతపులులు, నీల్గయ్, కృష్ణజింకలు, మచ్చల జింకలు, తోడేళ్లు కనిపిస్తాయి. అంతేకాదు జింకల కోసం ఏర్పాటుచేసిన రిహాబిలిటేషన్ సెంటర్ కూడా చూడొచ్చు.
క్షీర వాటర్‌ఫాల్
పేరుకు తగ్గట్టే ఈ జలపాతంలో నీళ్లు 100 అడుగుల ఎత్తు నుంచి పాల ధార లెక్క కిందకు దుముకుతాయి. దీన్ని ‘బోదర జలపాతం’ అని పిలుస్తారు. మందమర్రి మండలం మేడారం గ్రామంలో ఉంది ఈ జలపాతం. ఇక్కడికి వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. జలపాతం దగ్గరికి వెళ్లే దారంతా చెట్లు, కొండలతో చాలా బాగుంటుంది. రంగురంగుల పక్షులు, సీతాకోక చిలుకల పలకరింపులు వింటూ నడుస్తుంటే అలసట తెలియదు.
తెలంగాణ అన్నవరం
మంచిర్యాలలో గూడెం గుట్ట ‘శ్రీ సత్యనారాయణ స్వామి’ ఆలయం చాలా ఫేమస్. గూడెం గ్రామంలో గోదావరి తీరాన ఉంది ఈ గుడి. కార్తీకమాసంలో భక్తులు ఎక్కువగా వస్తారు. సత్యనారాయణ వ్రతం, పూజ చేస్తారు కొందరు. అందుకనే ఈ ఆలయాన్ని ‘తెలంగాణ అన్నవరం’ అని పిలుస్తారు. మంచిర్యాల నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడి.