Telangana Tour : ఈ వీకెండ్ అందాల లోకం ఆదిలాబాద్ చూసొద్దామా..

Telangana Tour : ఈ వీకెండ్ అందాల లోకం ఆదిలాబాద్ చూసొద్దామా..

ఆదిలాబాద్ అనగానే గుర్తుకొచ్చేవి ప్రకృతి అందాలు. ఏడాది అంతా ఈ జిల్లాలో టూర్ కు అవకాశం ఉన్నప్పటికీ ఈ టైంలో అయితే టూర్ మరింత అద్భుతంగా ఉంటుంది. పొగమంచు కప్పుకొనే ఊర్లు, దట్టమైన అడవులు, వాటి మధ్య ప్రయాణం.. మంచి అనుభూతిని ఇస్తుంది. అడవి అందాల నుంచి జాలువారే జలపాతాల వరకు ఈ ఉమ్మడి జిల్లా టూర్ లో ఎక్స్ పీరియెన్స్ చేయొచ్చు.

కాకతీయులు, చాళుక్యులు, కుతుబ్షాహీలు, నిజాంల వారసత్వ కోటలు.. భిన్నమైన కల్చర్ కి కేంద్రాలుగా ఉన్నాయి. నిర్మల్ కోట అత్యంత ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ లలో ఒకటి. దీన్ని శామ్ ఘడ్ కోట అని కూడా పిలుస్తారు. ఫ్రెంచ్ వాళ్లు కట్టిన ఈ కోట ఇప్పటికీ అద్భుతంగా ఉంది.ప్రకృతి ప్రేమికులకు, వైల్డ్ లైఫ్ ను దగ్గర నుంచి చూడాలనుకునే వాళ్లకు కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ చక్కని ప్రాంతం. అక్కడ జీప్ సఫారీ చేయొచ్చు. చిరుతలను, జింకలను, ఎలుగు బంట్లు వంటి రకరకాల అడవి జంతువులను దగ్గర నుంచి చూడటం మరపురాని అనుభూతి. ఇక్కడే గోదావరి నది పారుతుంటుంది. కొండలు, ఏపుగా పెరిగిన చెట్లతో నిండుగా కనిపించే ప్రకృతిని ఎంజాయ్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేదు. 

ఆదిలాబాద్ జిల్లాలో ప్రయాణించడం అంటే అడవి మధ్యలోంచి ఉండే హైవేల మీద జర్నీ చేయడమే. ఈ సీజన్ దట్టమైన అడవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆదిలాబాద్ టూర్ లో తప్పకుండా చూడాల్సింది కుంటాల జలపాతం. సుమారు 50 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు జాలువారడం టూరిస్టులను ఆకట్టుకుంటుంది. ఆదిలాబాద్ నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. మరొక జలపాతం ‘పొచ్చెర’. నిర్మల్ నుంచి 40కిలో మీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. బోథ్ మండలానికి వెళ్లే దార్లో  నేషనల్ హైవేకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

దాదాపు 20 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే నీళ్లు, సహజసిద్ధమైన అందాలు ఎంతో హాయినిస్తాయి. ఈ జిల్లా హ్యాండీ క్రాఫ్ట్స్ కు పెట్టింది పేరు. మెటల్ క్రాఫ్ట్స్ లేదా బెల్ మెటల్ క్రాఫ్ట్, నిర్మల్ బొమ్మలు పాపులర్ ఇక్కడ. నిర్మల్ చెక్క బొమ్మలపై పెయింటింగ్స్, గిరిజన కళలు ఇంటింటా కనిపిస్తాయి.

చేరుకోవడం ఇలా
హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు 300 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. బస్సులో అయితే సుమారు ఐదు నుంచి ఆరు గంటలలోపు చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో అయితే 4 గంటల్లోపు చేరుకోవచ్చు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల నుంచి బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.

టూర్ టైం
ఆదిలాబాద్ కు ఏడాది పొడవునా ఎప్పుడైనా వెళ్లొచ్చు. కానీ, చలికాలం మొదలయ్యేటప్పుడు వెళ్తే బాగుంటుంది.

Also read :- ఉత్తరకాశీ సొరంగంలో కార్మికులు సేఫ్ గానే ఉన్నారు..ఇంకో 60 మీటర్లు తవ్వితే బయటపడ్డట్టే..