నాగోబా జాతర.. కేస్లాపూర్‌‌‌‌లో బేతాల్ పూజలు..ఉత్సాహంగా మెస్రం వంశీయుల నృత్యాలు

నాగోబా జాతర.. కేస్లాపూర్‌‌‌‌లో బేతాల్ పూజలు..ఉత్సాహంగా మెస్రం వంశీయుల నృత్యాలు
  • నాగోబా దర్శనానికి తరలివస్తున్న భక్తులు 

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌‌‌‌ నాగోబా ఆలయంలో శనివారం మెస్రం వంశీయుల బేతాల్  పూజలు నిర్వహించారు. దీంతో సంప్రదాయ పూజలు ముగిశాయి. ముందుగా మెస్రం వంశ పెద్దలు సంప్రదాయ వాయిద్యాలతో గోవడ్  వద్దకు చేరుకున్నారు. 

మెస్రం వంశ మహిళలు పెద్దల కాళ్లు కడిగి బేతాల్‌‌‌‌ పూజలు చేసేందుకు స్వాగతం పలికారు. పూజల అనంతరం మెస్రం మహిళలు, కొత్త కోడళ్లు పెద్దలకు కానుకలు అందించారు. ఈ నెల 28న మహాపూజతో ప్రారంభమైన జాతర విజయవంతం కావడంతో మెస్రం వంశీయులు ఉత్సాహంగా బేతాల్‌‌‌‌ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. 

మహిళలు, కొత్త కోడళ్లు సైతం సంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం నాగోబాకు మొక్కుకొని సంప్రదాయ పూజలు ముగించారు. మహాపూజకు తీసుకొచ్చిన కొత్త కుండలను కితల వారీగా పంపిణీ చేసి ఏడాది పాటు కుండలకు పూజలు చేయాలని పెద్దలు సూచించారు. 

సంప్రదాయ పూజల సందర్భంగా కొత్త కోడళ్లు, భక్తులు వేసిన కానుకలు 22 కితలకు పంపిణీ చేశారు. రూ.78,875 కానుకలు వచ్చినట్లు మెస్రం వంశ పెద్దలు తెలిపారు. నాగోబా పూజలు ముగియడంతో అక్కడి నుంచి మెస్రం వంశీయులు ఉట్నూర్  మండలం శ్యాంపూర్​లోని బుడుందేవ్  ఆలయానికి బయలుదేరారు. ఈ నెల 3 నుంచి శ్యాంపూర్‌‌‌‌లో బుడుందేవ్ జాతర ప్రారంభం కానుంది. అక్కడ కూడా మెస్రం వంశీయులే ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభిస్తారు. 

తరలివస్తున్న భక్తులు..

నాగోబా జాతర మరో మూడు రోజుల పాటు కొనసాగనుంది. మెస్రం వంశానికి సంబంధించిన సంప్రదాయ పూజలు ముగిసిననప్పటికీ భక్తులు నాగోబా జాతరకు తరలివస్తున్నారు. గంటల తరబడి భక్తులు క్యూ లైన్​లో ఉండి నాగోబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.