లింగంపేట,వెలుగు : మహిళల ఆరోగ్యంపై ఆశాకార్యకర్తలు ప్రత్యేక దృష్టిసారించాలని పీహెచ్సీ వైద్యురాలు హిమబిందు అన్నారు. మంగళవారం లింగంపేటలో నిర్వహించిన బేటీబచావో..బేటీ పడావో కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గర్భిణులు లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, అబార్షన్ చేయించుకోవడం నేరమని మహిళలకు వివరించాలన్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బాలికల నిష్పత్తిని పెంచడం, బాలికా విద్యను ప్రోత్సహించడం, బాలికలపై హింసను అడ్డుకోవడం, బాలికల స్వతంత్రతను పెంపొందించడం 'బేటీబచావో- బేటీపడావో' పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. పథకం ఉద్దేశాలను గ్రామాలలో మహిళలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు ఫరీదా, చంద్రకళ, యాదగిరి, వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.