టీఆర్ఎస్ పాలనలో దళితులకు ద్రోహం

టీఆర్ఎస్ పాలనలో దళితులకు ద్రోహం

ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యేది దళితుడే అని చెప్పారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తానే సీఎం పదవిలో కూర్చుని రాష్ట్రంలో మొదటిగా ఆ దళితులనే దగా చేశారు. సొంత రాష్ట్రం వచ్చి ఏడేండ్లు గడుస్తున్నా నేటికీ దళితులకు అడుగడుగునా అవమానాలు పెరుగుతున్నాయి. కేవలం ఓట్ల కోసం మభ్య పెట్టి, అమాయక దళితులను వంచిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలో దళితుల జనాభా 16 శాతం. 59 ఉపకులాలుగా విభజించబడ్డ వారి జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కొనసాగుతున్నది. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ సైతం చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల చిన్న కులాలకు గౌరవం పెరుగుతుందని, పాలనలో సైతం భాగస్వాములవుతారని, నిర్ణాయక శక్తిగా ఎదుగుతారని భావించేవారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఆశలు, ఆశయాలకు కూడా సీఎం కేసీఆర్ తూట్లుపొడుస్తున్నారు.

సామాజికంగా, ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ రంగాల్లో పూర్తిగా వెనుకబడ్డ దళిత జాతిని ఉన్నత స్థాయికి తీసుకురావాలన్న ఆశయంతో అంబేద్కర్ వారికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు. విద్యా, ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయంగా రిజర్వేషన్లు పెట్టారు. పదేండ్ల కాలంలోనే అన్ని రంగాల్లో దళితులకు సముచిత స్థానం కల్పించాలని ఆశించారు. కానీ పాలకుల పాపాల వల్ల దళితుల జీవన స్థితిగతుల్లో మార్పులు రావటం లేదు. వారి పరిస్థితులు తెలంగాణలో మరీ అధ్వాన్నంగా మారుతున్నాయి.  ఆర్టికల్ 16 (4) రిజర్వేషన్లు, ఉద్యోగ కల్పన; ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలన, ఆర్టికల్ 46 ప్రత్యేక శ్రద్ధతో విద్య, ఆర్థిక సౌకర్యాల కల్పన, సామాజిక న్యాయం కోసం రక్షణ; ఆర్టికల్ 341, 342 గవర్నర్ల సహాయంతో దళితులను అభివృద్ధి చేయడం ఆర్టికల్ 335నియామకాలు; ఆర్టికల్ 338 దళితుల అభివృద్ధికి ఖర్చుచేసే నిధులు దారి మళ్లకుండా చూడటానికి సబ్‌‌ప్లాన్‌‌కు చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యాంగ పరమైన రక్షణ కల్పించారు అంబేద్కర్. కానీ వీటి అమలు విషయంలో ప్రభుత్వాలు, పాలకుల వైఫల్యం దళితుల పట్ల వారి చిన్న చూపుకు, వివక్షకు అద్దం పడుతున్నది.

రాష్ట్రంలో దళితులపై అరాచకాలు

రాష్ట్రంలో దళితుల పట్ల నేరాలు పెరుగుతున్నాయి. 2014లో 1104 సంఘటనలు జరిగితే, 2019లో నవంబర్ నాటికి 1904 సంఘటనలు జరిగాయి. కిరాతకమైన కుల దురహంకార హత్యలు 49 జరిగాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయినవారు, ఇసుకాసురుల చేతిలో బలైనవారు ఎక్కువగా దళితులే. వాళ్లను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నవారు టీఆర్ఎస్ నాయకులే. అత్యాచారాలు, దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు, అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం, గ్రామ బహిష్కరణలు. టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో దళితులకు ఏమాత్రం రక్షణ లేకుండాపోయింది. నేరెళ్లలో దళితులపై ఇసుక మాఫియా దాడులు, ఎదురుతిరిగిన దళితులను అరెస్టు చేయడం ద్వారా అధికార పార్టీ పెద్దలే నేరస్థులకు అండగా నిలుస్తున్నారు.

నిధుల కేటాయింపు ఘనం.. ఖర్చు సగమే

రాష్ట్ర ప్రభుత్వం 2014–-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2020–-21 వరకు గడిచిన ఏడేండ్లలో దళితుల ప్రత్యేక అభివృద్ధికి రూ.85,913 కోట్లు కేటాయించింది. కానీ అందులో ఖర్చు చేసింది రూ.47,685 కోట్లు మాత్రమే. దళితుల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ నినాదాలు బాగా వినబడుతున్నప్పటికి 50 శాతం లోపే నిధులు ఖర్చు చేసి దళితుల అభివృద్ధిని మాటలకే పరిమితం చేశారు. స్వయం ఉపాధి పథకం కోసం ఐదేండ్లుగా 5 లక్షల పైగా దరఖాస్తులు వస్తే లక్షా 20 వేల మందికి మంజూరు చేసి, వారిలో లక్ష మందికి మాత్రమే సబ్సిడీ విడుదల చేశారు. 2019–2021 మధ్య రెండేండ్లు యాక్షన్ ప్లాన్ విడుదల చేయనేలేదు. నిరుద్యోగ దళితులకు ఏటా సుమారు 2 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నా సబ్సిడీ లోన్ ఇచ్చింది లేదు. ప్రభుత్వ పెద్దలు లోన్ల మంజూరులో అనేక ఆంక్షలు విధించి వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. కనీసం నిరుద్యోగ దళితుల కోసం ఏటా 1500 కోట్లు కూడా కేటాయించలేకపోతున్నది ఈ ప్రభుత్వం.

కమిట్‌‌మెంట్ లేని మాటలు

ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించి కేసీఆర్ దళితుల ఓట్లు దండుకుంటున్నారు. అది చేస్తాం, ఇది చేస్తామని సెంటిమెంట్ మాటలు చెబుతున్నారే తప్ప వాటి కమిట్‌‌మెంట్‌‌ శూన్యం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా నెక్లెస్ రోడ్డు వద్ద భూసేకరణ చేశారు. రూ.140 కోట్లతో విగ్రహ ఏర్పాటుకు జీవో కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వయంగా ప్రకటించారు. కానీ ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. పైపెచ్చు పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహానికి అనుమతి లేదని చెప్పి, విగ్రహాన్ని జీహెచ్ఎంసీ జీపులో తరలించి జాతీయవాదుల మనోభావాలను గాయపరిచారు. ముషీరాబాద్‌‌లో అంబేద్కర్ భవన్ అన్ని హంగులతో నిర్మిస్తామని స్వయంగా కేసీఆర్ భూమిపూజ చేసి మూడేండ్లవుతున్నా ఇప్పటికీ పనులు మొదలుపెట్టలేదు. దళితులకు చెప్పిన మాటల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే పెద్ద నిదర్శనం.

అడుగడుగునా అవమానాలే

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దళితులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. ధనిక రాష్ట్రమని చెప్పిన కేసీఆర్ దళితులకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. కానీ సచివాలయం, అసెంబ్లీ, ప్రగతి భవన్ నిర్మాణాలకు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి మాత్రం వెనుకడుగేయడం లేదు. లక్ష చదరపు గజాల్లో ఫామ్ హౌస్‌లు నిర్మించుకున్న కేసీఆర్ కుటుంబం అంబేద్కర్ భవనాలకు, దళితుల రెండు పడక గదులకు, 3 ఎకరాల భూమి పంపిణీకి మాత్రం నిధులు లేవంటూ వివక్ష చూపుతున్నారు. ఆఖరికి ఎడ్యుకేషన్‌‌లో రిజర్వేషన్లు ఉన్నాయని పేరుకే తప్ప దళిత, బడుగు వర్గాలు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీల్లో సరైన వసతులు లేవు. వీసీలు లేక వర్సిటీల పాలన కూడా గాడితప్పింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం అనుమతించిన 5 ప్రైవేట్ విశ్వ విద్యాలయాలు మహీంద్రా, హెస్టన్, మల్లారెడ్డి, అనురాగ్, ఎస్ఆర్‌‌‌‌లలో రిజర్వేషన్లు అమలు చేసి నాణ్యమైన విద్య పొందే హక్కును కాపాడాలన్న సోయి లేకపోవడం విడ్డూరం.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేండ్లలో రాష్ట్ర అప్పులు రూ.69,515 కోట్లు ఉంటే, టీఆర్ఎస్ సర్కారు కొలువుతీరిన ఏడేండ్లలోనే అవి రూ.3 లక్షల కోట్లకు పెరిగాయి. కనీసం దానికి తగ్గట్టు అభివృద్ధి, ప్రజా ఆస్తుల్లో, దళిత, బడుగు జనాల సంక్షేమం, సాధికారత, తలసరి ఆదాయం పెరుగుదల లాంటివి కనిపించిన దాఖలాలు లేవు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజలపై భారం మోపి.. అవినీతి, అక్రమాలతో కేసీఆర్ కుటుంబం, వారి బినామీల ఆస్తులు అమాంతంగా పెంచుకున్నారు.  ఇలాగే చూస్తూ కూర్చుంటే దళితులకు రాను రానూ ఈ ప్రభుత్వంలో మనుగడే కష్టమయ్యే పరిస్థితులు ఎదురుకావచ్చు. అందుకే దళితులందరూ తమ న్యాయపరమైన హక్కులు సాధనలో అంబేద్కర్ చూపిన పోరాట మార్గానికి సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది.

మూడెకరాలు ఇవ్వకపోగా.. దళితుల భూములు లాక్కొనుడేంది?

రాష్ట్రంలో మొత్తం సాగుభూమి 1.65 కోట్ల ఎకరాలు. అందులో దళితుల భూములు నామమాత్రం. ముఖ్యమంత్రి ప్రకటించినట్లు భూమి లేని 3 లక్షల దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి పథకం కింద గత ఏడేండ్లలో 6,662 కుటుంబాలకు 16,544.13 ఎకరాల భూమి మాత్రమే ఇచ్చారు. ఇందులో 511 మందికి 1122.02 ఎకరాలకు సంబంధించి నేటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. ప్రతి ఏటా 10 వేల కోట్ల రూపాయలు కేటాయించి, ఐదేండ్లలో 50 వేల కోట్లు ఖర్చుచేసి భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి భూమి ఇస్తామని ఆశలు రేకెత్తించి, మాట తప్పిన దళిత ద్రోహి కేసీఆర్. పైగా గ్రామాల్లో పార్కులు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, పారిశ్రామిక పార్కులు నిర్మాణం పేరిట దళితుల అసైన్డ్ భూములను లాక్కోవడానికి మించిన దుర్మార్గపు చర్య లేదని చెప్పాలి. భూ సర్వే, రెవెన్యూ యాక్టుల పేరుతో దళితులు ఏళ్ల నుండి సాగు చేస్తున్న భూముల్లో పేర్లు మాయమయ్యాయి. అనేక ప్రాజెక్టుల్లో దళిత, పేద రైతులను బెదిరించి భూములు లాక్కున్నారు. ఈ తీరుగ దళితులను దగా చేసి, ధనవంతులకు దోచి పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం. డాక్టర్ కె.లక్ష్మణ్, అధ్యక్షుడు, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా. 

ఇవి కూడా చదవండి

పెద్దసార్లు దిగరు.. కొలువులు రావు

‘చిత్రం’ సీక్వెల్ అనౌన్స్ చేసిన తేజ

అక్కడ రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేలు ఫైన్    

అప్పుడు పబ్‌‌.. ఇప్పుడు వైల్డ్‌‌లైఫ్‌‌ హాస్పిటల్‌