- యూఎస్, ఇండియాలోని ఉద్యోగులను తొలగించిన బెటర్ డాట్ కామ్ విశాల్ గర్గ్
న్యూఢిల్లీ: జూమ్ మీటింగ్‌లోనే 900 మంది ఉద్యోగులను తీసేసి కిందటేడాది వార్తల్లో నిలిచిన బెటర్ డాట్ కామ్ సీఈఓ విశాల్ గర్గ్, తాజాగా మరో 3 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఈ సారి యూఎస్, ఇండియాలోని ఉద్యోగులను ఆయన తొలగించారు. జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగులను తొలగించడంతో కంపెనీ సీఈఓ పదవి నుంచి కిందటేడాది డిసెంబర్‌లో గర్గ్ దిగిపోయారు. మళ్లీ ఈ ఏడాది ప్రారంభంలో సీఈఓగా వచ్చారు. ఈ 3 వేల మంది ఉద్యోగులను బుధవారం తీసేయాలని కంపెనీ ప్లాన్ చేసిందని టెక్‌క్రంచ్ పేర్కొంది. కానీ, జాబ్ నుంచి తీసేసిన ఉద్యోగులకు హెచ్‌ఆర్ యాప్‌లో సివరెన్స్ చెక్ (జాబ్ నుంచి తీసేసేటప్పుడు ఇచ్చే మనీ) మంగళవారం యాక్సిడెంటల్‌గా కనిపించాయని వివరించింది. ఎందుకు జాబ్ నుంచి తొలగించారో చెప్పలేదని ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. సేల్స్, ఆపరేషన్స్ సెగ్మెంట్‌లోని ఉద్యోగులను ఈ ఆన్‌లైన్ మోర్టగేజ్ కంపెనీ తీసేసింది. గతంలో 4 వేల మందిని తొలగిస్తారనే వార్తలు వచ్చాయి. మార్కెట్‌లోని పరిస్థితులకు తగ్గట్టు అడ్జెస్ట్ కావాల్సి ఉందని, తమ కార్యకలాపాలను గాడిలో పెట్టడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని బెటర్ డాట్ కామ్ ప్రకటించింది. యూఎస్, ఇండియాలోని వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకోవడం ఇందులో భాగమని వివరించింది. ఉద్యోగులకు సెవరెన్స్ పే కింద 60–80 రోజుల జీతాన్ని ఇచ్చారని టెక్‌క్రంచ్ పేర్కొంది.