- పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్
- ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో సమావేశం
ములుగు, వెలుగు : ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరలో సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను రాష్ర్ట పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ ఆదేశించారు. మేడారం జాతరలో భక్తులకు అందించాల్సిన సేవలపై నోడల్ ఆఫీసర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య అధ్యక్షతన గురువారం ములుగు కలెక్టరేట్ లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వైద్యాధికారుల సమన్వయ సమావేశంలో రవీందర్ నాయక్ మాట్లాడారు.
జాతర సమయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. మాస్కులు సరిపడా అందుబాటులో ఉంచాలని, అవసరమైన మందులను ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. నోడల్ ఆఫీసర్ డాక్టర్ అల్లెం అప్పయ్య మాట్లాడుతూ మేడారం జాతరలో విధులు నిర్వహించడానికి సిద్ధం అవుతున్నామన్నారు. వివిధ జిల్లాల్లో పనిచేసే వైద్యాధికారులను జాతర సమయంలో ప్రత్యేక వైద్య సేవలు అందించేలా ఉత్తర్వులు జారీ చేయాలని రవీందర్ నాయక్ ను ఆయన కోరారు.
9 విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులను జాతరలో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. 2022లో జరిగిన జాతరలో రెండు లక్షల మంది భక్తులకుపైగా ఓపీ సేవలు అందించామని గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్యాధికారులు డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రమణ, డాక్టర్ మధుసూదన్ , డాక్టర్ శిరీష , డాక్టర్ అంబరీష్, ములుగు జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.