రాష్ట్రంలో పోలీసు శాఖ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. పోలీసు శాఖలో ఎక్కువ మంది అధికారులు, సిబ్బంది రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. రాజకీయ నాయకులు, అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా చేస్తున్నారు. జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్యే అనుమతి లేనిదే ఒక సీఐని గాని, ఎస్సైని గాని బదిలీ చేసే పరిస్థితి లేదు. రాజకీయ నాయకుల అండదండలతో కొందరు పోలీసు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అవినీతి, భూదందాలు, విపరీత ధనార్జన, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ సీఐ వివాహితను గన్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు వెలుగులోకి రావడం కలకలం రేపింది. నిందితుడు సీఐ నాగేశ్వరరావు కేసు ఒక చిన్న ఉదంతం మాత్రమే. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఓ ఎస్సై పోలీస్ కొలువు కోసం సన్నద్ధమవుతున్న ఓ అభ్యర్థినికి పుస్తకాలు ఇస్తా.. అని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చింది. ఇలాంటి వారు పోలీసుశాఖలో చాలా మంది ఉన్నారు. కొందరు నీతిమంతులైన అధికారులను, సిబ్బందిని మినహాయిస్తే మిగిలిన అధికారులు, సిబ్బంది రకరకాల అవినీతికి, పాడు పనులకు పాల్పడుతున్నారు.
కేసుల దర్యాప్తులోనూ..
ఎమ్మెల్యేలు, పార్లమెంట్సభ్యులపై నమోదైన కేసుల విచారణకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయగా, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులపై నమోదైన సుమారు 400 కేసుల్లో ఒక శాతం మాత్రమే శిక్ష పడగా, మిగిలిన కేసులన్నీ వీగిపోయాయి. కేసు విచారణ తర్వాత జడ్జి తీర్పునిస్తూ పోలీసు శాఖ సరైన సాక్ష్యాధారాలు చూపించనందున కేసులు కొట్టివేయబడుతున్నాయని తీర్పులో చెప్పడం గమనార్హం. ఈ తీర్పు పోలీసు, రాజకీయ నాయకుల సంబంధాలను తేటతెల్లం చేసింది. ఇంకో సందర్భంలో పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలతో నయీం అనే ఒక వీధి రౌడీ ఒక గ్యాంగ్‌స్టర్‌గా తయారై వందలమంది గూండాలతో ఒక నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నయీం ఇల్లు సోదా చేసినప్పుడు ఆయన ఇంట్లో ఏకే 47 వంటి తుపాకులు, బుల్లెట్‌ఫ్రూప్ జాకెట్లు దొరికాయి. ఇవన్నీ పోలీసు వారి అండదండలు లేనిదే ఓ గ్యాంగ్స్టర్ఎలా సంపాదించుకోగలడు? నయీంకు సహకరించిన పోలీసు అధికారులపై మొదట్లో చర్యలు తీసుకున్నట్లు అనిపించినా
ఆ తర్వాత కేసును నీరుగార్చారు.
అథారిటీల ఏర్పాటు నామ్‌కే వాస్తే..
పోలీసు కంప్లయింట్ అథారిటీ రాష్ట్ర, జిల్లా స్థాయిలో పనిచేస్తుంది. రాష్ట్ర స్థాయి పోలీసులపై విచారణ కమిటీ విశ్రాంత హైకోర్టు లేదా విశ్రాంత సుప్రీం కోర్టు జడ్జి అధ్యక్షతన సమాజంలో మంచి పేరున్న ముగ్గురు వ్యక్తులు ఉంటారు. వీరు ఐపీఎఎస్ అధికారులపై వచ్చే ఫిర్యాదులను విచారిస్తారు. జిల్లా స్థాయిలో ఉండే కమిటీ విశ్రాంత జిల్లా జడ్జి అధ్యక్షతన ముగ్గురు సమాజంలో మంచి పేరున్న వ్యక్తులు ఉంటారు. వీరు జిల్లా స్థాయిలో డీఎస్పీ వరకు వచ్చే ఫిర్యాదులను విచారిస్తారు. పోలీస్ కంప్లయింట్అథారిటీల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అమలు చేయకపోవడంతో రాష్ట్ర హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది. దీంతో ఆదరబాదరగా 2021 జులై 7న అరకొర మందితో రాష్ట్ర భద్రతా కమిషన్ తోపాటు రెండు జిల్లాలకు పోలీసు కంప్లయింట్ అథారిటీలని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దురదృష్టవశాత్తు ఇవి ఇంతవరకు ఒక్కసారి కూడా మీటింగ్ జరపలేదు. హైకోర్టులోని కేసుకు ముగింపు పలకడంలో భాగంగానే.. నామ్‌కే వాస్తే రాష్ట్ర భద్రతా కమిషన్, పోలీసు కంప్లయింట్ అథారిటీలను ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది.
సంస్కరణలు రావాల్సిందే..
రాష్ట్రంలో నేడు ప్రజలకు పోలీసు అధికారులు న్యాయబద్ధంగా, చట్టం ముందు అందరూ సమానమే అన్న రీతిలో పని చేస్తారన్న నమ్మకం పోయింది. కొందరు అక్రమార్కులతో మొత్తం డిపార్టుమెంట్‌కు చెడ్డపేరు వస్తోంది. మొత్తంగా రాజకీయ ప్రమేయం లేకుండా పోలీస్ వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉంది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు..
పోలీసు శాఖలో సంస్కరణల కోసం సుప్రీం కోర్టు 2006వ సంవత్సరంలో కొన్ని కీలక సూచనలు చేసింది. వాటిలో ముఖ్యమైనవి రాష్ట్రస్థాయిలో భద్రతా కమిషన్ ఏర్పాటు, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోలీసుల ఫిర్యాదు విచారణ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్ర స్థాయి భద్రతా కమిటీలో ముఖ్యమంత్రి లేదా హోంశాఖ మంత్రి అధ్యక్షతన డీజీపీ కార్యదర్శిగా, అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడు, ఒక విశ్రాంత హైకోర్టు జడ్జి, హోం శాఖ సెక్రటరీ, ఐదుగురు నిష్ణాతులు సభ్యులుగా ఉంటారు. వీరు పోలీసు శాఖ పనితీరును పరిశీలించి దానికి సంబంధించిన సూచనలు చేస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా పోలీసు శాఖపై రాజకీయ ఒత్తిడి లేకుండా చూడటం. అలాగే పోలీసు శాఖ వార్షిక నివేదిక అసెంబ్లీ ముందు ఉంచాల్సి ఉంటుంది.
- ఎం. పద్మనాభరెడ్డి,
కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్