Mahadev Betting App Scam: రూ.417 కోట్ల స్కాంలో సినిమా హీరోలు, హీరోయిన్ల పేర్లు

బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో బెట్టింగ్‌ యాప్‌ స్కాం కలకలం రేపుతోంది. మహదేవ్‌ అనబడే బెట్టింగ్‌ యాప్‌ మాటున జరుగుతున్న భారీ స్కాం తాజాగా బయటపడింది. యాప్‌ ముసుగులో భారీ మొత్తంలో డబ్బులు హవాలాలో తరలిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఏకంగా రూ.417 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేసింది ఈడీ. ఈ కేసులో బాలీవుడ్‌ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ బెట్టింగ్‌ యాప్‌ ను నిర్వహిస్తున్న వ్యకి పెళ్లికి బాలీవుడ్‌ నుండి ప్రముఖులు పెద్దఎత్తున హాజరవ్వటంతో.. వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. అంతేకాదు వారికి త్వరలోనే సమన్లు కూడా జారీచేయనున్నట్లు తలుస్తోంది. ఈ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రకర్‌ పెళ్లి కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు చేశారట. ఈ పెళ్లికి బాలీవుడ్‌ స్టార్స్ టైగర్‌ ష్రాఫ్‌, నేహా కక్కర్‌, సన్నీ లియోన్‌, అతిప్‌ అస్లమ్‌, రహత్‌ ఫతేహ అలీ ఖాన్‌.. తదితరులు హాజరయ్యారు. కేవలం పెళ్లిలో జరిగిన ఈవెంట్స్ కోసమే.. రూ.112 కోట్ల హవాలా డబ్బు వాడినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపధ్యంలోనే మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ఏర్పాటు చేసిన ఈవెంట్స్ కు హాజరైన బాలీవుడ్‌ స్టార్స్ కు ఈడీ నోటీసులు జారీచేయనుందని సమాచారం.