మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్

 మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్
  • ప్రయాణికులు, నెటిజెన్ల విమర్శలు
  • తొలగించాలని ఆదేశించామన్న ఎండీ ఎన్వీఎస్​రెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు: సినీ తారలు, సెలబ్రిటీలు, ఇన్​ఫ్లూయన్సర్లు బెట్టింగ్​యాప్స్ ను ప్రమోట్​చేసి కేసుల్లో ఇరుక్కోగా, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో కూడా నెటిజన్స్​నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. దీనికి కారణం మెట్రో రైళ్లు కూడా బెట్టింగ్​యాప్​లను ప్రమోట్​చేయడమే.. రైళ్ల బయట, లోపల బెట్టింగ్ యాప్స్ యాడ్స్ స్టికర్లు కనిపిస్తున్నాయి. 

వాటిని ఫొటోలు, వీడియోలు తీసి.. నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ  విమర్శిస్తున్నారు. ఆన్​లైన్​బెట్టింగ్ యాప్స్ ను వ్యతిరేకిస్తూ మొదటి నుంచి సూచనలు చేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్(ట్విటర్) ఖాతాకు ట్యాగ్ చేస్తూ హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్ మెట్రో యాజమాన్యంపై విరుచుకుపడుతున్నారు. బెట్టింగ్ యాప్స్​ప్రమోట్​చేసిన సినీతారలు, యూట్యూబర్లపై కేసులు పెట్టారని, మెట్రో రైల్​పై కూడా కేసులు పెట్టాల్సిందేనని డిమాండ్​చేస్తున్నారు.  

ప్రకటనలు తొలగిస్తున్నాం: ఎన్వీఎస్ రెడ్డి  

మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్స్​కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వీటిని గురువారం రాత్రే తొలగించాలని అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలను ఆదేశించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.