
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కాగా, మెట్రో రైల్లో బెట్టింగ్ ఆప్ ప్రమోషన్లను సవాల్ చేస్తూ అడ్వకేట్ నాగూర్ బాబు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చట్ట విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్స్‌పై సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశించాలని కోరారు. రోజుకి దాదాపు 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలులో నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఎలా ప్రమోషన్‌కి అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణలో గేమింగ్ యాక్ట్ 2017 అమల్లో ఉందని.. చట్టాన్ని ధిక్కరించి HMRL లేదా దాని అనుబంధ సంస్థలు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి ఎన్ని కోట్ల ముడుపులు తీసుకున్నారో ఈడీ దర్యాప్తు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం (ఏప్రిల్ 24) విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.