భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు : తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపైనే ఖమ్మం జిల్లా ప్రజలు ఎక్కువ ఫోకస్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఏపీతో ఎక్కువ సరిహద్దు ఉండడం, మొదటి నుంచి ఆంధ్రా ప్రాంతంతోనే ఎక్కువ సంబంధాలు ఉన్న నేపథ్యంలో అక్కడి ఎన్నికలపై జోరుగా చర్చ నడుస్తోంది. సోమవారం రిజల్ట్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నారు.
జోరుగా బెట్టింగ్‌లు
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. మధిర, ఎర్రుపాలెం, అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువగా బెట్టింగ్‌లలో పాల్గొంటున్నారు. మధిర మండలానికి చెందిన ఓ వ్యక్తి టీడీపీ గెలుస్తుందని సుమారు రూ. 1.50 కోట్ల బెట్టింగ్ కట్టినట్లు సమాచారం. ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కూటమి గెలుస్తుందని రూ. కోటికి పైగా పందెం కాసినట్లు తెలిసింది. వైసీపీ గెలుస్తుందని తల్లాడ మండలంలో పలువురు రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు పందెం కాయగా, టీడీపీ గెలుస్తుందంటూ మరికొందరు బెట్ కట్టారు. అశ్వారావుపేటలో దాదాపు రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పైగా పందేల్లో పెట్టినట్లు సమాచారం. ఇందులో ఎక్కువ మంది కూటమి గెలుస్తుందంటూ పందెం వేశారు. రూ. 10 లక్షలు పందెం కడితే గెలిచిన వారికి రూ. 15 లక్షలు ఇచ్చేలా అగ్రిమెంట్లు రాసుకుంటుండడం గమనార్హం. టీడీపీ కూటమి గెలిస్తే రూ. 10 లక్షలిస్తే చాలు, వైసీపీ గెలిస్తే రూ. 20 లక్షలు ఇస్తామంటూ సత్తుపల్లి, దమ్మపేట ప్రాంతాల్లో పందేలు వేస్తున్నారు. ఈ రెండు మండలాల్లోనే సుమారు రూ. 30 కోట్ల నుంచి రూ. 40 కోట్ల మేర పందేల్లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పందాలు కడ్తున్నారు. మరికొద్ది గంటల్లో అటు లీడర్లతో పాటు, ఇటు పందెం రాయుళ్ల భవిష్యత్ కూడా తేలనుంది.
ఏ నలుగురు గుమిగూడినా ఇదే చర్చ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, దమ్మపేట, భద్రాచలం, అశ్వారావుపేట, చర్ల, దమ్మపేట, ముల్కలపల్లి, అన్నపురెడ్డిపల్లి ప్రాంతాల్లో నలుగురు వ్యక్తులు గుమిగూడితే చాలు ఏపీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. అక్కడ జగన్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందా ?, జగన్ సోదరి షర్మిల ప్రభావమెంత ? అనే టాపిక్‌పై ప్రజలు డిస్కస్ చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ సైతం కూటమి వైపే మొగ్గు చూపడంతో ప్రజల ఆసక్తి మరింత పెరిగింది.