హైదరాబాద్‌‌‌‌ వ్యాపారవేత్తతో జాగ్రత్త!..ఐపీఎల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ను హెచ్చరించిన బీసీసీఐ

 హైదరాబాద్‌‌‌‌ వ్యాపారవేత్తతో జాగ్రత్త!..ఐపీఎల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ను హెచ్చరించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌లో పాల్గొంటున్న వారిని అవినీతి కార్యకలాపాల్లోకి ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీసీసీఐ.. అన్ని ఫ్రాంచైజీలకు హెచ్చరికలు జారీ చేసింది. లీగ్‌‌‌‌లో పాల్గొన్న వ్యక్తులను ట్రాప్‌‌‌‌ చేయడానికి హైదరాబాద్‌‌‌‌కు చెందిన ఓ వ్యాపారవేత్త చురుకుగా ప్రయత్నిస్తున్నాడని వెల్లడించింది. ఫ్రాంచైజీ ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌‌‌‌లు, సపోర్ట్‌‌‌‌ స్టాఫ్​ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.  పంటర్లు, బుకీలతో ఈ వ్యాపారవేత్తకు స్పష్టమైన సంబంధాలున్నాయని గతంలోనే నిరూపితమైందని బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా విభాగం (ఏసీఎస్‌‌‌‌యూ) స్పష్టం చేసింది.

 ఈ నేపథ్యంలో సదరు వ్యాపారవేత్తతో ఏవైనా సంభాషణలు జరిపితే వాటిని నివేదించాలని, ఇతరత్రా అంశాలున్నా బహిర్గతం చేయాలని ఏసీఎస్‌‌‌‌యూ అన్ని ఐపీఎల్‌‌‌‌ ఫ్రాంచైజీలను కోరింది. ‘లీగ్‌‌‌‌లో పాల్గొంటున్న అన్ని పార్టీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో  అప్రమత్తంగా వ్యవహరించాలి. ఓ వ్యాపారవేత్త ఖరీదైన బహుమతులతో కొంత మందిని అవినీతి ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నాడు. సదరు బిజినెస్‌‌‌‌ మ్యాన్‌‌‌‌ అభిమానిగా నటిస్తూ ప్లేయర్లకు దగ్గరవుతున్నాడు. జట్టు హోటళ్లలో, మ్యాచ్‌‌‌‌ల వద్ద అతను కనిపిస్తున్నాడు. ఆటగాళ్లు, ఇతర సిబ్బందితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రైవేట్‌‌‌‌ పార్టీలకు ఆహ్వానాలు పంపిస్తున్నాడు. జట్టు సభ్యులకే కాకుండా వారి ఫ్యామిలీస్‌‌‌‌కు కూడా బహుమతులు ఇస్తున్నట్లు సమాచారం. ఫ్రాంచైజీ ఓనర్స్‌‌‌‌, ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌, ప్లేయర్లు, కోచ్‌‌‌‌లు, సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌, కామెంటేటర్లను హై ఎండ్‌‌‌‌ పార్టీలకు పిలుస్తున్నాడు. విదేశాల్లో ఉండే వారితోనూ సంభాషణ చేసేందుకు యత్నిస్తున్నాడు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి’ అని ఏసీఎస్‌‌‌‌యూ పేర్కొంది.