సిమ్ స్వాపింగ్’​తో అకౌంట్లు గుల్ల

  సిమ్ స్వాపింగ్’​తో అకౌంట్లు గుల్ల
  • సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసం
  • కస్టమర్​తోనే సిమ్ డీయాక్టివేట్ చేయించి మరీ లూటీ
  • సైబర్ కేటుగాళ్ల చేతిలో సిమ్ యాక్టివేట్
  • సర్వీస్ ప్రొవైడర్ల పేరుతో ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్
  • నెట్ బ్యాంకింగ్​తో రాత్రి పూట గంటల వ్యవధిలోనే అకౌంట్లు ఖాళీ

హైదరాబాద్, వెలుగు: ‘సిమ్ స్వాపింగ్’తో సైబర్ నేరగాళ్లు అమాయకుల అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్లుగా అవతారమెత్తి కస్టమర్ కేర్ పేరుతో ఫేక్ కాల్స్ చేసి డబ్బులు దోచేస్తున్నారు. అరగంటలో సిమ్ బ్లాక్ అవుతుందని కాల్స్, మెసేజ్ చేసి.. నంబర్ 1 నొక్కండని చెప్పి కస్టమర్​తోనే సిమ్​ను డీయాక్టివేట్ చేయిస్తున్నారు. 

ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు సిమ్​ను యాక్టివేట్ చేసుకుని నెట్ బ్యాంకింగ్, ఓటీపీలతో అర్ధరాత్రి అకౌంట్లను గుల్ల చేస్తున్నారు. డార్క్ నెట్ ద్వారా సేకరించిన మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో బ్యాంకుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్​కు ఓటీపీలు ఎవరూ చెప్పడం లేదు. దీంతో సైబర్ కేటుగాళ్లు ‘సిమ్ స్వాపింగ్’ పేరుతో కొత్త తరహా లూటీకి ప్లాన్ చేస్తున్నారు. 

సర్వీస్ ప్రొవైడర్ల సింబల్స్​తో ఫేక్ ట్రూ కాలర్

ట్రూ కాలర్‌‌‌‌‌‌‌‌లో ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల సింబల్స్‌‌‌‌తో ఫేక్‌‌‌‌ ట్రూ కాలర్ ఐడీ క్రియేట్‌‌‌‌ చేస్తున్నారు. డార్క్‌‌‌‌వెబ్‌‌‌‌తో పాటు ఈ కామర్స్‌‌‌‌ సైట్లు సహా ఇతర ఏజెన్సీల ద్వారా ఫోన్ నంబర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన ఫోన్‌‌‌‌ నంబర్లకు సిమ్ బ్లాక్‌‌‌‌/డ్యామేజ్‌‌‌‌ అయ్యిందంటూ మెసేజ్‌‌‌‌లు చేస్తున్నారు. ‘‘మీ ఫోన్ సైబర్‌‌‌‌ నేరాల్లో లింక్ అయి ఉన్నది. ఈ నంబర్‌‌‌‌‌‌‌‌పై ముంబై, ఢిల్లీలో మనీలాండరింగ్‌‌‌‌ కేసులు నమోదయ్యాయి. అర గంట లేదా గంట వ్యవధిలో మీ సిమ్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ అవుతుంది లేదా డీయాక్టివేట్‌‌‌‌ అవుతుంది”అని కస్టమర్ సర్వీస్ సెంటర్ పేరుతో మెసేజ్ లేదంటే కాల్ చేస్తున్నారు. 

దీనికి ముందు తమ వద్ద ఉన్న ఫోన్ నంబర్ల నెట్​వర్క్​ను జీరో లెవల్‌‌‌‌కి తీసుకొస్తున్నారు. నెట్‌‌‌‌వర్క్ ఫెయిల్ అయిన కొన్ని నిమిషాల తర్వాత కస్టమర్ కేర్ పేరుతో వీఓఐపీ (వాయిస్‌‌‌‌ ఓవర్ ఇంటర్నెట్‌‌‌‌ ప్రొటోకాల్‌‌‌‌) కాల్ చేస్తారు. ‘‘మీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో సమస్య ఉంది. మొబైల్ కీ ప్యాడ్​లో 1వ నంబర్ నొక్కండి’’అని వాయిస్ వినిపిస్తుంది. ఇది నిజమే అనుకుని కాల్ రిసీవ్ చేసిన వ్యక్తి.. 1ని ప్రెస్ చేయగానే.. ఒక్కసారిగా మొబైల్ నెట్‌‌‌‌వర్క్ జీరో లెవల్‌‌‌‌కి చేరుతుంది.

ఫేక్ కాల్స్, మెసేజ్​లతో సిమ్ డీయాక్టివేట్

కస్టమర్ కేర్ పేరుతో.. సిమ్‌‌‌‌కార్డ్‌‌‌‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించాలంటే తాము చెప్పినట్లు చేయాలని సూచిస్తారు. ఆధార్ కార్డ్ నంబర్​తో పాటు సిమ్‌‌‌‌కార్డుపై ఉండే 16 అంకెల ఐఎమ్ఎస్ఐ నంబర్ తమకు పంపించాలని చెప్తారు. అందుకోసం మొబైల్ ఫోన్ స్క్రీన్​పై డిస్​ప్లే అయ్యే తమ నంబర్‌‌‌‌ ద్వారా సర్వీస్  ప్రొవైడర్​కు పంపాలని చెప్తారు. తర్వాత సైబర్ నేరగాళ్లే.. సర్వీస్‌‌‌‌ ప్రొవైడర్ల మాదిరిగా వివిధ నంబర్ల నుంచి ఎస్‌‌‌‌ఎమ్‌‌‌‌ఎస్‌‌‌‌లు పంపిస్తారు. ఎలాంటి అనుమానం రాకుండా సిమ్‌‌‌‌కార్డ్‌‌‌‌ యూజర్‌‌‌‌‌‌‌‌లను మాయమాటలతో భయాందోళనకు గురిచేస్తుంటారు. 

ఈ క్రమంలోనే సిమ్​పై ఉన్న నంబర్​తో పాటు తమకు కావాల్సిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ లేదంటే కస్టమరే స్వయంగా చెప్పేలా ప్లాన్ చేస్తారు. తర్వాత సిమ్ నంబర్, ఆధార్ నంబర్​తో మరో సిమ్ యాక్టివేట్ చేసి కస్టమర్ సిమ్​ను బ్లాక్ చేస్తారు. సైబర్ నేరగాళ్ల వద్ద ఉన్న సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే కస్టమర్ సెల్​లో ఉన్న సిమ్ ఆటోమేటిక్​గా బ్లాక్ అవుతుంది. 

స్వాపింగ్​తో హ్యాకర్ల చేతిలోకి ఓటీపీలు

స్వాపింగ్‌‌‌‌ చేసిన సిమ్‌‌‌‌ కార్డుతో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లు, పిన్‌‌‌‌ నంబర్లు అన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తాయి. ఎలాంటి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ట్రాన్సాక్షన్ జరిపినా.. అకౌంట్/సిమ్ హోల్డర్ ఫోన్​కు ఓటీపీలు వెళ్లవు. సిమ్ స్వాపింగ్ కారణంగా అప్పటికే ఆ సిమ్ బ్లాక్ అయి ఉంటుంది. ఓటీపీలు, ఇతర అలర్ట్​లు సైబర్ నేరగాళ్ల వద్ద ఉన్న ఫోన్ నంబర్లకు వస్తుంటాయి. 

దీంతో గంటల్లోనే కస్టమర్ ఖాతాలను ఖాళీ చేస్తారు. కస్టమర్​కు ఈ విషయం తెలిసేలోపే అకౌంట్లు ఖాళీ అయి ఉంటాయి. ఈ ఆన్​లైన్ లావాదేవీలు రాత్రి 11.45 నుంచి 12.15లోపు చేస్తుంటారు. అర్ధరాత్రికి ముందు.. ఆ తర్వాత డేట్ మారే టైమ్‌‌‌‌లో కస్టమర్‌‌‌‌‌‌‌‌ విత్‌‌‌‌డ్రా లిమిట్‌‌‌‌ ఎంత ఉంటే అంత ట్రాన్స్​ఫర్ చేసుకుంటారు.

సిమ్ కార్డుపై ఉన్న నంబర్లు చెప్పొద్దు

సిమ్‌‌‌‌ కార్డుపై ఉన్న నంబర్లు ఇతరులకు చెప్పొద్దు. ఏదైనా నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ సమస్య ఉంటే సంబంధిత సర్విస్ ప్రొవైడర్ వద్దకు వెళ్లాలి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఫేక్‌‌‌‌ కస్టమర్‌‌‌‌‌‌‌‌ కేర్ నంబర్లు కూడా ఉంటాయి. సిమ్‌‌‌‌ కార్డు బ్లాక్ అవుతుందని మెసేజ్ లేదంటే కాల్ వచ్చినా పట్టించుకోవద్దు. సైబర్ నేరాలకు నంబర్ లింక్ అయి ఉందని చెప్పినా నమ్మొద్దు. అలర్ట్​గా ఉంటే సిమ్ స్వాపింగ్ జరిగే అవకాశం ఉండదు. ఇలాంటి కేసులే గతంలో ఢిల్లీలోనూ నమోదయ్యాయి. 
- విశ్వనాథ్, ఎథికల్ హ్యాకర్, హైదరాబాద్‌‌‌‌