UPI Scam: సెకన్లలో ఖాతాలో సొమ్ము మాయం.. ఈ కొత్త P2P స్కామ్స్ గురించి తెలుసా..?

UPI Scam: సెకన్లలో ఖాతాలో సొమ్ము మాయం.. ఈ కొత్త P2P స్కామ్స్ గురించి తెలుసా..?

P2P Scams: ఒకప్పుడు దొంగలు డబ్బు దోచుకెళ్లాలంటే ఊళ్లమీద పడేవారు. కానీ నయా టెక్నాలజీ యుగంలో వారు వేల మైళ్ల దూరం నుంచి ప్రజల బ్యాంక్ ఖాతాల్లో నుంచి డబ్బు కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్లు దీనికోసం రోజురోజుకూ కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు. అయితే వీటి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన జరుగుతున్న మోసాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో జీవితకాలం కష్టపడి సంపాదించిన డబ్బును ప్రజలు సెకన్లలోనే పోగొట్టుకుంటున్నారు. 

ALSO READ | పెట్రోల్ బంకుల్లో జరిగే క్రెడిట్ కార్డ్ మోసాలివే.. ఈ టిప్స్ ఫాలో అయితే మీ డబ్బు సేఫ్..!

ప్రస్తుతం మనం పీర్ టూ పీర్ మోసాల గురించి తెలుసుకుందాం. అనింద్యా అనే యువతి తన ఫోన్ రింగ్ కావటంతో ఎత్తింది. అయితే అవతలి వ్యక్తి తాను అనింద్యా తండ్రి స్నేహితుడిగా పరిచయం చేసుకున్నాడు. ఆ పేరుతో తన తండ్రికి ఫ్రెండ్ ఉన్నాడని తెలిసిన ఆమె మాట్లాడటం కొనసాగించింది. దీంతో నిందితుడు తనకు కొంత ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడిందని.. అనింద్యా తండ్రికి కాల్ చేస్తే ఫోన్ ఎత్తలేదని చెప్పుకొచ్చాడు. పరిస్థితి అర్థం చేసుకున్న అనింద్యా దీనిని నిర్థారించుకోవటానికి తండ్రి పక్కన లేకపోవటంతో నమ్మకంగా మాట్లాడిన నిందితుడికి రూ.25 వేలు ట్రాన్స్‌ఫర్ చేసేసింది. తద్వారా తాను మోసపోయినట్లు సదరు యువతి గ్రహించింది. అయితే అప్పటికే తన డబ్బును ఆమె కోల్పోవాల్సి వచ్చింది.

ఇక రెండో కేసులో ఒక వ్యక్తికి బ్యాంక్ అధికారి రూపంలో కాల్ వచ్చింది. అతడు బ్యాంక్ ఖాతా కలిగి ఉన్న పేరు చెబుతూ అకౌంట్ కేవైసీ ప్రక్రియ పెండింగ్ ఉందని, దీనిని పూర్తి చేయటానికి ఒక లింక్ పంపుతున్నట్లు వెల్లడించాడు. అయితే లింక్ క్లిక్ చేయగానే యూపీఐ చెల్లింపులకు అది రీరూట్ అయ్యింది. యూపీఐ పిన్ ఎంటర్ చేయాలని దాని వల్ల ఎలాంటి డబ్బు డిడక్ట్ కాదని ఫోన్ కాల్ లో ఉన్న వ్యక్తి చెప్పటంతో పిన్ ఎంటర్ చేశాడు. అంతే సెకన్లలో సైబర్ నేరగాళ్ల ఖాతాకు డబ్బు వెళ్లిపోయింది. 

ఇక మరికొన్నింటిలో నిందితులు తప్పుగా మన బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపినట్లు పేర్కొంటూ దానికి సంబంధించిన ఒక ఫేక్ స్కీన్ షాట్ చూపి తమ డబ్బును వెనక్కి కోరుతున్నట్లు మోసాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల బయటపడింది. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అనేక కొత్త యూపీఐ ఆధారిత చెల్లింపు మోసాలకు పాల్పడటం ఆందోళనలు కలిగిస్తోంది. 

మోసాల నుంచి తప్పించుకోవటానికి చిట్కాలు..
- ముందుగా తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చినప్పుడు వారికి డబ్బు పంపకండి. ఓటీపీ, సీవీవీ వంటి వివరాలు ఇవ్వకండి.
- మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు వేరే నంబర్ నుంచి వచ్చే కాల్స్ కాన్ఫరెన్స్ ద్వారా మెర్జ్ చేయకండి.
- కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు మీ స్నేహితుడికి ఫ్రెండ్ అంటే వెంటనే మీ స్నేహితుడిని క్రాస్ వెరిఫై చేయండి.
- ఫేక్ సోషల్ మీడియా ఖాతా నుంచి డబ్బు అవసరమని మీ స్నేహితుడిగా మెసేజ్ చేసినప్పుడు వెంటనే వారికి కాల్ చేసి మాట్లాడండి.
- బ్యాంక్ అధికారులం అంటూ ఎవరైనా కాల్ చేస్తే బ్యాంకుకు నేరుగా వెళ్లి పని పూర్తి చేసుకుంటానని చెప్పి కచ్ చేయండి.
- ఏదైనా అనుమానం వస్తే ముందుగానే మీ బ్యాంక్ ఖాతాలు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను ఫ్రీజ్ చేసుకోవటం సేఫ్. 
- వాట్సాప్ కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్, యూపీఐ లేదా బ్యాంక్ యాప్స్ ఓపెన్ చేయమని అడిగితే ఆ కాల్ కట్ చేసి వెంటనే వారి వివరాలు పోలీసులకు అందించండి.  -
- ఎల్లప్పుడూ కేవైసీ వంటి ప్రక్రియలను నేరుగా బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయండి.