కవర్ స్టోరీ : వైరస్​ రష్..ఈ సీజన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?

కవర్ స్టోరీ : వైరస్​ రష్..ఈ సీజన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?

వానాకాలం వచ్చిందంటే చాలు ఊరూరా చెక్కర్లు కొడుతుంది ఫీవర్. ఈ సీజన్​లో చిన్న క్లినిక్​ నుంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​ వరకు అన్ని చోట్లా పేషెంట్లు ‘క్యూ’ కడుతుంటారు. ఈ ‘క్యూ’ అంతా రకరకాల వైరల్​ ఫీవర్లతో బాధపడే వాళ్లదే. అంటే.. వానాకాలం వైరస్‌లకు టైం వచ్చిందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సీజన్‌లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొందరిలో జ్వరం బయటకు కనిపించకపోయినా అలాంటి లక్షణాలతోనే ఇబ్బంది పడుతుంటారు. అందుకే..ఈ సీజన్​లో జ్వరాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. 

వానాకాలం... వ్యాధులకు వెల్​కం చెప్పే సీజన్​. ఫీవర్లలో చాలా రకాలున్నప్పటికీ ఈ సీజన్​లో వచ్చేవి మాత్రం ఎక్కువగా వైరల్​ ఫీవర్లే. వైరస్​ వల్ల వచ్చే ఈ జ్వరాలతో కాస్త జాగ్రత్తగా ఉండాలంటారు డాక్టర్లు. దానికి కారణం వైరస్​లు జెట్ స్పీడ్​లో వ్యాప్తి చెందడమే. వాటి వ్యాప్తి ఎలా ఉంటుందంటే.. కొంత దూరంలో ఉన్న ఇనుమును అయస్కాంతం తన శక్తితో ఎలాగైతే లాగేసుకుంటుందో అచ్చం అలానే.. వద్దన్నా వచ్చేస్తుంది వైరల్​ ఇన్ఫెక్షన్. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే కొవిడ్​ వైరస్​ బెస్ట్ ఎగ్జాంపుల్. కొవిడ్ మనల్ని ఎంత భయభ్రాంతులకు గురిచేసిందో తెలిసిందే. అయితే వైరల్ ఫీవర్లు ఈ కాలంలోనే ఎందుకొస్తాయో తెలుసుకునే ముందు వైరస్​లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియాలి. 

అన్నింటికీ కారణం దోమే!

సాధారణంగా ఏడిస్ ఈజిప్టి.. అనే దోమ కాటు వల్ల వైరల్​ ఫీవర్లు వస్తాయి. దోమలకు తేమ వాతావరణం అంటే భలే ఇష్టం. వానాకాలం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది దోమలకి అనుకూలంగా ఉండే సీజన్. ఈ సీజన్​లోనే వందల సంఖ్యలో కొత్త దోమలు పుట్టుకొస్తాయి. మామూలుగా ఒక జీవి పుట్టిందంటే అది పెరగడానికి కొంత టైం పడుతుంది. కానీ దోమల్లాంటి చిన్న జీవులకు ఎదిగేందుకు అంత టైం అక్కర్లేదు. అవి పుట్టిన వారం రోజుల్లోనే పెద్దవి అయిపోతాయి. అప్పటి నుంచి వాటికి వైరల్ ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉంటుంది. అలాంటి ఏడిస్ దోమలు కుడితే వైరస్​ వంట్లో చేరుతుంది. ఆ తరువాత ఇన్​ఫెక్షన్‌ వచ్చి దాని లక్షణాలు బయటపడతాయి. ఒకవేళ ఆ దోమలేవో కనుక్కొని జాగ్రత్త పడాలనుకుంటే కనుక అవి చిన్న పరిమాణంలో ఉంటాయి కాబట్టి.. వాటిలో ఏడిస్ దోమ ఏదో కనిపెట్టడం కొంచెం కష్టం. అందుకే అవి కుట్టకుండా జాగ్రత్త పడాలి. పగటిపూట కుట్టే వాటిలో ఏడిస్ రకం దోమలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పగటి పూట దోమలు కుట్టకుండా చూసుకోవడం చాలా కీలకం అని చెప్తారు డాక్టర్లు. 

వైరల్ ఇన్ఫెక్షన్లు మూడు రకాలు

వైరల్ ఇన్ఫెక్షన్లు మూడు రకాలుగా సోకుతాయి. ఒకటి శ్వాస తీసుకోవడం.... శ్వాస తీసుకోవడం వల్ల గాల్లో తుంపర్లు ముక్కులోపలకి వెళ్తాయి. ఆ తరువాత ముక్కు దిబ్బడ, దగ్గు లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందికి బ్రాంకైటిస్, న్యుమోనియా వరకు వెళ్తుంది. 
రెండోది మింగడం ... రోటా వైరస్​ కలుషిత ఆహారం, నీటి ద్వారా మనిషిలోకి చేరుతుంది. ఎంటిరో వైరస్ అంటే పొట్టకు సంబంధించిన వైరస్​లు. వీటివల్ల కూడా వైరల్ ఇన్ఫెక్షన్​ వచ్చే అవకాశం ఉంది. 
మూడోది దోమ కుట్టడం.. వైరస్​ ఇన్ఫెక్ట్​ అయిన దోమ మనిషిని కుట్టినప్పుడు  వైరస్ ఎటాక్ అవుతుంది. 
ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే... పలు రకాల సూక్ష్మ జీవులు మనిషిని ఎఫెక్ట్ చేయడానికి వాటికి వేరువేరు మార్గాలు ఉంటాయి. డెంగీ, చికున్ గున్యా, ఎల్లో ఫీవర్ వంటి ఆర్బో వైరస్​లు దోమ కాటు వల్ల వస్తాయి. గతంలో గమనిస్తే ... ఫ్లూ​, కొవిడ్స్​, ఎడినో వైరస్​ల వంటివి గాలి ద్వారా సోకాయి. వైరస్​లను బట్టి అవి దాడిచేసే మార్గాలు  మారుతుంటాయి. కానీ, లక్షణాలు మాత్రం ఒకేలా ఉంటాయి. తలనొప్పి, కీళ్ల నొప్పులు, జ్వరం, కఫం, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, లూజ్​ మోషన్స్​, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, వైరస్ స్వభావాన్ని బట్టి వాటి ప్రభావం కనిపిస్తుంది. మామూలుగా అయితే మూడు నుంచి ఐదు రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. 

మన దగ్గరే ఎక్కువ..

వానాకాలం కావడంతో దోమల సంతతి పెరిగే టైం ఇది. వాతావరణం అనుకూలంగా ఉంటే వాటి పాపులేషన్ బాగా పెరిగిపోతుంది. దాంతో వాటి వ్యాప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సీజన్​లో  ఫంక్షన్లు, పార్టీల పేరుతో ఎక్కువగా బయటకు వెళ్తుంటారు. అలాగే జనాలు ఎక్కువగా ఉన్న ప్లేసుల్లో మాస్క్​ లేకుండా తిరుగుతుంటారు. గుంపులుగుంపులుగా ఉన్న చోట వైరస్​ ఈజీగా వ్యాప్తి చెందుతుంది.
దాదాపు 500 రకాల వైరస్​లు ఉంటాయి. వాటిలో ఏ వైరస్ అయినా దాడి చేయొచ్చు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరు వినపడుతోంది. 
వైరస్​ల రకాలను బట్టి వాటి పేర్లు మారుతుంటాయి. అయితే, మనుషులు ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల వైరస్​ వ్యాప్తి ఎక్కువ జరుగుతుంది. ఒక వెహికల్ ఎలాగైతే ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్తుందో అలాగే వెక్టార్ కూడా ప్రయాణిస్తుంది. 
మనుషులు, వైల్డ్​ లైఫ్​తో దగ్గరగా ఉంటున్నారు. ఆ వాతావరణంలోకి మనం, మన వాతావరణంలోకి అవి రావడం వల్ల వాటి నుంచి వ్యాపించే వైరస్​లు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడో గానీ స్పొరాడికా అనేది వచ్చేది కాదు. కానీ ఇప్పుడు రెగ్యులర్​గా అలాంటి కేసులు చూస్తున్నాం. 

సింప్టమాటిక్ ట్రీట్​మెంట్

చాలావరకు సింప్టమాటిక్ ట్రీట్​మెంట్ సరిపోతుంది. లక్షణాలను బట్టి జబ్బు తగ్గించేందుకు మొదట ప్రయత్నిస్తారు. స్వైన్​ ఫ్లూకి తప్ప చాలావరకు వైరల్ ఇన్ఫెక్షన్​లకు సింప్టమాటిక్ ట్రీట్​మెంట్ చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఫ్లూ వైరస్​లకు యాంటీబయాటిక్స్ లేవు. మెడికల్​ షాపులకు వెళ్లి మెడిసిన్స్​ కొనుక్కుని అస్సలు వాడొద్దు. యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల యాంటీబాడీస్ పెరుగుతాయి. యాంటీ బయాటిక్స్ వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు అవి పనిచేయకుండా పోతాయి. కాబట్టి ఎడాపెడా యాంటీ బయాటిక్స్ వాడొద్దు. 
సాధారణంగా  జ్వరాన్ని మన బాడీ, మూడు నుంచి ఐదు రోజుల్లో రికవర్​ చేస్తుంది. అలా జరగడం మంచిది. అలాకాకుండా యాంటీబయాటిక్స్​కి శరీరాన్ని అలవాటు చేయకూడదు. వైరల్ ఇన్ఫెక్షన్​లకు ఫ్లూయిడ్ ఇవ్వడం, హైడ్రేషన్, న్యూట్రిషన్ మెయింటెయిన్ చేయడం, కాంప్లికేషన్స్​ వచ్చినప్పుడు అందుకు తగిన ట్రీట్​మెంట్ ఇవ్వడం వంటివి తప్ప వైరల్ ఇన్ఫెక్షన్​లకు ప్రత్యేకించి ట్రీట్​మెంట్ ఏమీ ఉండదు. 

ఈ సీజన్​లో స్కూల్​ పిల్లల విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్కూల్స్​లో పిల్లలు గుంపులు గుంపులుగా తిరుగుతుంటారు. అలాంటి చోట్ల పరిసరాలు శుభ్రంగా లేకపోతే దోమలు ఉంటాయి. అక్కడ ఒకరికి దోమ కుట్టి జ్వరం వస్తే... అది ఇంట్లో వాళ్లకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్ అనేది అంటువ్యాధి. దీనిపై పీడియాట్రిషన్ డాక్టర్ కరుణ మాట్లాడుతూ.. ‘‘వైరస్​ వల్ల ఫీవర్ వస్తుంది. కాబట్టి దాన్ని వైరల్ ఫీవర్​ అంటాం. రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది కాబట్టి ‘వైరస్’ అంటాం. వైరల్​ ఇన్ఫెక్షన్లకు ప్రత్యేకించి ఒక ట్రీట్​మెంట్ అనేది ఉండదు. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే ఆ బ్యాక్టీరియాకి తగ్గట్టు కచ్చితమైన ట్రీట్​మెంట్ ఉంటుంది. బ్యాక్టీరియాని కల్చర్ చేసి సెన్సిటివిటీ ఎలా ఉంది? ఏ మందు పనిచేస్తుంది? అనేది చూస్తారు. వైరస్​ విషయానికొస్తే.. డెంగీ, చికున్ గున్యా, జికా, చాందిపుర వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వైరస్​లన్నింటికీ కారణం ఒకటే. అది.. ఏడిస్ దోమ. ఆ దోమ కుట్టడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి జరుగుతోంది. గుజరాత్​లో చాందిపుర వైరస్ ఎక్కువగా ఉందని పదుల సంఖ్యలో చనిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వైరస్ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్​లో కూడా 2003లో వచ్చిన సమాచారం ఉంది. 

మళ్లీ మళ్లీ రావచ్చు

ప్రస్తుతం అయితే మన దగ్గర డెంగీ, చికున్ గున్యా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ డెంగీ, చికున్​ గున్యా ఫీవర్లకు కారణమైన వైరస్​ని ‘ఫ్లేవీ వైరస్’ అంటాం. ఇది నాలుగు రకాలుగా ఉంటుంది. లైఫ్​ టైంలో నాలుగు సార్లు డెంగీ ఫీవర్ అనేది రావచ్చు. ఒకసారి మైల్డ్​గా వచ్చిపోయాక మన బాడీలో యాంటీ బాడీస్​ ఉంటాయి. కాకపోతే ఆ యాంటీ బాడీస్​ వైరస్​తో పోరాడేందుకు సరిపోవు. దాంతో  మళ్లీ వచ్చే అవకాశం ఉంది. నాలుగు రకాల్లో సివియర్​గా ఉండే వైరస్ కూడా ఎటాక్​ కావచ్చు. మొత్తంగా చూస్తే.. డెంగీ ఫీవర్ అనేది ప్రజల్లో 85 శాతం ఉంటుంది. అది వస్తే.. జ్వరం, తలనొప్పి, వాంతులు, కంటి వెనక నొప్పి, దద్దుర్లు, కీళ్ల నొప్పులు వస్తాయి. పారాసెటమాల్​ వాడడం, శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకోవడం వల్ల 85 శాతం మందిలో తగ్గిపోతుంది.

15 శాతం మందికి మాత్రం హై ఫీవర్, లో బీపీ, డెంగీ షాక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులు వస్తాయి. అలాగే గుండె, మెదడు ప్రభావితం కావడం, తెల్ల రక్తకణాలు తగ్గడం వంటివి ఆందోళన కలిగిస్తాయి. ఇలాంటప్పుడు హాస్పిటల్లో చేర్చాల్సిన అవసరం ఉంది.15 శాతం హాస్పిటల్లో చేరే అవకాశం ఉంది. ఐదు శాతం ఐసీయూకి వెళ్లే పరిస్థితి ఉంది. ఒక్క శాతం మరణం సంభవించే ప్రమాదం ఉంది. డెంగీ మరణాలు పోయినేడాది చూశాం. ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట చూస్తున్నాం. 
పిల్లల్లో ముఖ్యంగా ఎడినోనార్వాక్ వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది.  స్కూల్లో ఎక్కువగా ఎటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ పిల్లలు ఇంట్లో వాళ్లకు అంటిస్తున్నారు. ఒకసారి వైరస్ ఎటాక్​ అయ్యి కోలుకున్నాక, మళ్లీ వేరే రకమైన వైరస్​ ఎటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. 

ఆ దోమను కంట్రోల్ చేస్తే..

డెంగీ వచ్చేది ఫ్లేవీ వేరియెంట్ వల్ల. అలా ఒక్కో ఏరియాలో ఒక్కో డిఫరెంట్ వేరియెంట్ ఉండొచ్చు. అందువల్ల సివియారిటీ అనేది వేరియెంట్​ని బట్టి ఉంటుంది. జికా వైరస్ ఫీటస్​ని ఎఫెక్ట్ చేస్తుంది. చికున్ గున్యా, చాందిపుర వైరస్​లు వేరేలా ఎఫెక్ట్ చేస్తాయి. అయితే, వైరస్​ల ప్రభావం కూడా ప్రతిసారి మారుతుంటుంది. ఒకసారి ఎక్కువ రక్తం అవసరం కావచ్చు. మరోసారి ఐసీయూలో ఉంచి, ట్రీట్​మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు కండిషన్ కంట్రోల్లో ఉండదు. ఒక్కోసారి మైల్డ్ ఫీవర్​ కలిగించే కారకాలు చనిపోతాయి. ఈసారి మాత్రం సివియర్​ అయ్యే ఛాన్సులు తక్కువగా కనిపిస్తున్నాయి.
మలేరియాకి మస్కిటో ప్రివెన్షన్ ప్రోగ్రామ్ ఉంది. దానికంటూ నియమనిబంధనలు అనేవి ఉన్నాయి. అలాగే డెంగీ, చికున్​ గున్యాకు కూడా అలాంటి ప్రోగ్రామ్​లు రావాలి. ఎందుకంటే ఏడిస్ దోమని కంట్రోల్ చేయగలిగితే డెంగీ, చికున్ గున్యా, జికా వంటి వైరస్ లను అరికట్టొచ్చు. 

చికున్ గున్యా కేసులు మళ్లీ..

ఇప్పుడు చికున్ గున్యా కేసులు విపరీతంగా వస్తున్నాయి. కొన్నేండ్ల కిందట చికున్ గున్యా ఊరూరా పాకింది. అప్పుడు ఆ వ్యాధి బారిన పడ్డవాళ్లు నడవలేక ఇబ్బందిపడ్డారు. అది అన్ని వయసుల వాళ్లలో కనిపించింది. కానీ పిల్లల్లో చికున్ గున్యా వచ్చిన కేసులు చాలా తక్కువ సంఖ్యలో రికార్డ్ అయ్యాయి. కానీ, మధ్యమధ్యలో చాలామంది కండరాల నొప్పితో హాస్పిటల్స్​కి వెళ్తున్నారు. డెంగీలానే, చికున్ గున్యా కేసులు కూడా తరుచూ వస్తున్నాయి. అయితే చికున్ గున్యా లక్షణాలను బట్టి టెస్ట్ చేయాలి. కానీ డాక్టర్లు అలా చేయట్లేదు. ఒకసారి ఐదుగురికి చేశారంటే, కొందరికి నెగెటివ్ వస్తుంది. ఇలాంటప్పుడు అందరికీ ట్రీట్​మెంట్ ఇస్తే వాళ్లలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. నాలుగైదు రోజుల్లోనే జ్వరం తగ్గుతుంది. నొప్పులు ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పి, ప్లేట్​లెట్స్ కౌంట్ చూసుకుని వాళ్లకు ట్రీట్​మెంట్ ఇస్తారు. 

పరిష్కారం నివారణే

వైరల్​ ఫీవర్ల బారిన పడకుండా ఉండాలంటే దోమల నివారణే పరిష్కార మార్గం. ఇవి స్వచ్ఛమైన నీళ్లలో పెరుగుతాయి. అంటే.. ఇంటి ఆవరణలోనే ఉంటాయి. సీజనల్​గా వచ్చే సమస్య కాబట్టి ముందుగానే అప్రమత్తం అవ్వాలి. ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో ఈ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ రోగాలను కలిగించే ఏడిస్ దోమ 50 మిల్లీ లీటర్ల నీటిలో 200 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు ఒక వారంలో పెద్దవైపోతాయి. ఆ దోమలు కుడితే డెంగీ వైరస్ సోకుతుంది. ఒకరికి సోకాక ఆ ఏరియాలో ఇంకొందరికి డెంగీ వచ్చే అవకాశం ఉంది.  

ఇంటి బాల్కనీలో, సింక్​లో, టెర్రస్​ మీద... ఇలా ఎక్కడపడితే అక్కడ దోమలు ఉంటాయి. కాబట్టి ఎవరికి వారు స్వతహాగా నివారణ చర్యలు తీసుకోవాలి. ఇంట్లో టెర్రస్ పైన, కుండీల్లో చెత్తా చెదారం, తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే స్కూళ్లలో, హాస్పిటల్స్​లో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఎవరికివారు ఇండ్లలో, స్కూళ్లలో, ఆఫీసుల్లో, హాస్పిటల్స్​లో దోమలు రాకుండా మెష్​లు ఏర్పాటు చేసుకోవాలి. మస్కిటో రెపెల్లెంట్స్, మస్కిటో బ్యాట్​ వంటివి వాడాలి. 
ఇంట్లో మస్కిటో రెపెల్లెంట్స్ వాడాలి. దోమ వంద మీటర్ల వరకే వెళ్తుంది. అందుకని ఒకరికి వస్తే ఇంట్లో మిగతా వాళ్లకి వచ్చే అవకాశం ఉంది. అలాగే వెక్టార్ వ్యాప్తి నివారించాలి. ఇంట్లో, బయట ఎక్కడైనా గుంపులుగా ఉండే ప్రదేశాల్లో నిల్వ నీరు ఉండనీయొద్దు. వారానికొకసారి వాటిని క్లీన్ చేయాలి. అలాగే ట్యాంక్​లలో లార్విసైడ్ వేయడం, ఇంటి చుట్టుపక్కల దోమల మందు పిచికారి చేయాలి. దోమలు కుట్టకుండా కొన్ని ఆయిల్స్ ఉంటాయి. వాటిని ఒంటికి పూసుకోవచ్చు.

అయితే... ఒక్కరో ఇద్దరో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నివారణ సాధ్యం కాదు. కాబట్టి గవర్నమెంట్ దీనిపై చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొవిడ్ టైంలో ఒక్కరోజులోనే ఎంతో అవగాహన కల్పించారు. అలాగే ఇప్పుడు కూడా సెలబ్రిటీలతో ఈ విషయంపై అవగాహన కల్పించాలి. ఏయే కాలనీ, స్కూళ్లలో ఎక్కువ కేసులు వస్తున్నాయనే సమాచారం సేకరించాలి. ఆ బాధ్యతను ఎంటమాలజీ టీంకి ఇవ్వాలి. ఆ టీం గ్రౌండ్​ లెవల్లో సర్వే చేసి రిపోర్ట్​ ఇవ్వాలి. ఏఎన్​ఎంలకు దీని గురించి చెప్పి, అవేర్​నెస్ కల్పించేలా ప్రోగ్రామ్స్ చేయాలి. ఇలా కమ్యూనికేషన్ ఉంటేనే ప్రజలకు తెలుస్తుంది. జబ్బు వస్తే డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ, ముందే దాని గురించి తెలుసుకుంటే జబ్బు బారిన పడకుండా ఉండొచ్చు.

ఏరియాకో పేషెంట్ ఉన్నా.. 

ఒక కాలనీలో ఒక్క డెంగీ కేసు వస్తే.. మిగతా వాళ్లకు రాకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం అందరినీ అప్రమత్తం చేసేలా బ్యానర్ కట్టాలి. ఒక్క కేసు వచ్చిందంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న 50 ఇండ్లు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పరిసరాల్లో దోమల మందు కొట్టాలి. ఇది డబ్ల్యూహెచ్ఓ రూల్. తర్వాత క్లినికల్ కేర్​లో భాగంగా డాక్టర్లు తమ దగ్గరకు వచ్చిన కేసుల్లో మైల్డ్, మోడరేట్, సివియర్​ అనేవి చెక్ చేయాలి. గవర్నమెంట్​తో పాటు డాక్టర్లు కూడా ఈ విషయంలో చొరవ చూపించాలి. లేదంటే అనవసరంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రజలకు. డెంగీ టెస్ట్​కు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఒక టెస్ట్​కే అంత డబ్బు ఖర్చుపెట్టే స్థోమత సామాన్యులకు ఉండదు. కాబట్టి బస్తీ దవాఖానాల్లో ఆ టెస్ట్​లు అందుబాటులో ఉండాలి. ఆ సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫీసర్లకు, డాక్టర్లకు, ప్రజలకు మధ్య ఎలాంటి కో– ఆర్డినేషన్, కమ్యూనికేషన్ లేకపోతే పనులు ముందుకు సాగవు. అక్టోబర్ వరకు స్కూల్​కి వెళ్లే పిల్లలకు చేతులను, కాళ్లను కప్పుతూ నిండుగా డ్రెస్ వేయాలి. డెంగీ కేసు వస్తే ఏరియా ఎంటమాలజీ డిపార్ట్​మెంట్​లో కంప్లయింట్ చేయాలి.  

ఒక పనికి పూనుకున్న వెంటనే రిజల్ట్ కనిపించదు. అందుకు పోలియో వ్యాక్సిన్​ ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ వ్యాక్సిన్​ గురించి మొదట్లో అవగాహన లేదు. కానీ, ఇప్పుడు చదువులేని వాళ్లు కూడా వెళ్లి టీకాలు వేయించుకుంటున్నారు. పోలియో వ్యాక్సిన్ సక్సెస్ కావడానికి 20 ఏండ్లు పట్టింది. ఆ సక్సెస్​ అవేర్​నెస్ వల్లే వచ్చింది. టీవీలో యాడ్స్, సెలబ్రిటీల ద్వారా చెప్పించడం, పేపర్లలో న్యూస్ రావడం వల్లే. మార్పు అనేది ఒక్కరోజులో రాదు. ఇది కూడా అంతే... ఇప్పటికే పదేండ్లకు పైగా దీనివల్ల ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికీ దీన్ని సీరియస్​గా తీసుకోకపోతే ఇంకెప్పుడు నిర్మూలిస్తాం? ఇంకెన్ని ప్రాణాలు పణంగా పెట్టాలి? అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి.

నోబెల్ ప్రైజ్ అవార్డు గ్రహీత సర్ రొనాల్డ్ రోస్ మస్కిటో సైకిల్ కనుక్కున్నాడు. దానికి సంబంధించిన సెంటర్ హైదరాబాద్​లోనే ఉంది. ఆయన గౌరవార్థం అయినా మస్కిటో స్టేట్ క్యాంపెయిన్ చేయాలి.  

జాగ్రత్తలు ఇవి

  •     గుంపులుగా ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. 
  •     ఎవరికి ఈజీగా ఎటాక్ అవుతుందో? ఎవరికి వస్తే సీరియస్ అవుతుందో వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. 
  •     వర్షంలో తడవకూడదు. వ్యక్తిగత శుభ్రత పాటించాలి.
  •     బయటకు వెళ్లినప్పుడు శరీరం నిండుగా దుస్తులు ధరించాలి. దానివల్ల పగటిపూట కుట్టే దోమ కాటు నుంచి బయటపడొచ్చు. 
  •     మూడు రోజుల్లో జ్వర తీవ్రత తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. 

 డా. రాహుల్ అగర్వాల్ క్లినికల్ డైరెక్టర్ జనరల్ మెడిసిన్  కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

లెక్క తేల్చాలి

ఒక ఏరియాలో లేదా ఒక ఊళ్లో వచ్చే కేసులు లెక్కపెట్టి చెప్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్​నే తీసుకుంటే ఇక్కడ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? ఎన్ని డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయి? ఒక్కో దానికి రోజుకి ఇలాంటి పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు? అనేది చూస్తే ఆ సంఖ్య అంచనాలను మించుతోంది. అంతేకాదు ఫిజీషియన్లు, పీడియాట్రిషన్లు ఇలా వేర్వేరు డాక్టర్ల దగ్గరకు ఇలాంటి పేషెంట్లు వస్తూనే ఉన్నారు. ఇలా ఏ లెక్కన చూసినా కేసులు ఎక్కువగానే ఉంటాయి. అందుకని లెక్కలు చూసుకుంటూ ఈ ఏడాది గడిచిపోయింది అనుకోవడం కంటే ఈ విషయంలో ప్రజల్ని భాగస్వామ్యం అయ్యేలా చేయాలి.

గవర్నమెంట్ చొరవతో.. సమస్యకు చెక్​!

ఈ వైరస్ మనదగ్గర ఎలా ఉంది? దీనికి ఎక్కడ టెస్ట్​లు చేస్తున్నారు. ట్రీట్​మెంట్ అందుతుందా? వంటి అంశాలపై నాలెడ్జ్ లేదు. ఇలాంటప్పుడు గవర్నమెంట్ చొరవ తీసుకుని దాని గురించి పూర్తి సమాచారం ప్రజలకు అందించాలి. చిన్న చిన్న  గ్రామాల్లో ప్రజలు ఎవరైనా కండరాల నొప్పులతో బాధపడుతుంటే వాళ్లకు డెంగీ, చికున్ గున్యా, జికా వైరస్​ టెస్ట్​లు చేయాలి. ఎక్కడ ఏ వైరస్​ ఉందో సమాచారం ఇవ్వాలి. లక్షణాలను బట్టి అది ఏ వైరస్ తెలుసుకుని, దానికి తగిన ట్రీట్​మెంట్ ఏంటో చెప్పాలి. ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటే వెంటనే హాస్పిటల్లో చేర్పించమని సలహాలు, సూచనలు ఇవ్వాలి.

ఇదంతా చేయకపోవడం వల్ల ప్రజల్లో అవగాహన ఉండట్లేదు. దాంతో వ్యాధులు ప్రబలి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హాస్పిటల్​కి వెళ్లి టెస్ట్​లు చేయించుకుంటే సమస్య ఏ పాటిదో తెలుస్తుంది. కానీ, హాస్పిటల్​కి వెళ్తే ఎంత ఖర్చు అవుతాయో? ఆ ఖర్చు భరించే శక్తి సామాన్యులకు ఉంటుందా? అనారోగ్యంతో మరణించే వాళ్లలో పేదలే ఎక్కువగా ఉంటున్నారు. అందుకు కారణం ట్రీట్​మెంట్ ఉన్నా వాళ్ల పేదరికం వల్ల అంత ఖర్చు పెట్టలేకపోవడమే.  కొవిడ్ టైంలో గవర్నమెంట్ చొరవ తీసుకుని అవేర్​నెస్ ప్రోగ్రామ్​లు చేసింది. గవర్నమెంట్, ప్రైవేట్ డాక్టర్లంతా కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. అలానే దీని విషయంలో కూడా చేయడం చాలా అవసరం.

- మనీష పరిమి