
- పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో రామయ్య కల్యాణం కన్నులపండువగా సాగింది. భక్తులు భారీగా తరలివచ్చి ఆ అపూర్వ ఘట్టాన్ని తిలకించారు. రామనామం మర్మోగుతుండగా ఆదివారం అభిజిత్‍లగ్నంలో వివాహం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు హాజరై.. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
తెల్లవారుజామున 2 గంటల నుంచే..!
శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం తెల్లవారుజాము నుంచే భద్రాద్రిలో మొదలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటలకు పురోహితులు ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, అభిషేకం చేపట్టారు. కార్యక్రమానికి సీఎస్
శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తదితరులు హాజరయ్యారు. అనంతరం కల్యాణమూర్తులను పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల నడుమ మిథిలాస్టేడియం ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్తుల జయజయధ్వానాల మధ్య రజత సింహాసనంపై రామయ్యను, సీతమ్మను కూర్చోబెట్టారు.
ముందుగా తిరువారాధన, విశ్వక్సేన పూజ,పుణ్యాహవచనం నిర్వహించి మండప శుద్ధి చేశారు. ఈ సమయంలో ప్రత్యేక మంత్రాన్ని జపిస్తూ వేదపండితులు సంకల్పంతో స్వామివారికి ఎదురుగా సీతమ్మను కూర్చోబెట్టి కన్యావరణలు జరిపారు. మోక్షా బంధం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీతధారణ, వధూవరుల వంశగోత్రాలకు సంబంధించి ప్రవరలు ప్రవచించారు. ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పుష్పోదక స్నానం జరిపి వరపూజ చేపట్టారు. భక్తరామదాసు చేయించిన నగలను వధూవరులకు ధరింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరంగం, తిరుమల తిరుపతి, శృంగేరీపీఠం, భక్తరామదాసు వారసులు కంచర్ల శ్రీనివాస్‍లు సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు.
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పట్టువస్త్రాలు స్వామికి సమర్పించారు. భద్రాద్రి రాముడి కల్యాణ వైభవ ప్రాశస్త్యంతో పాటు భక్తరామదాసు చేయించిన ఆభరణాల విశిష్టతను వేదపండితులు వివరించారు. సరిగ్గా 12 గంటలకు అభిజిత్‍లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని విశిష్టతను వివరిస్తూ ఉత్సవమూర్తుల శిరస్సుపై ఉంచారు. దశరథుడు, జనకమహారాజు తరఫున, భక్తుల తరఫున భక్తరామదాసు చేయించిన మూడు మంగళసూత్రాలతో సూత్రధారణ కన్నులపండువగా నిర్వహించారు. తలంబ్రాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తలంబ్రాల కార్యక్రమం శాస్త్రోక్తంగా అర్చకస్వాములు చేశారు. భాగవోత్తముల ఆశీర్వచనంతో కల్యాణం ముగిసింది.
ఏప్రిల్ 7న గవర్నర్ రాక
సోమవారం భద్రాద్రిలోని మిథిలాస్టేడియంలో రామయ్య మహాపట్టాభిషేకం జరగనుంది. ఇందులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొననున్నారు. పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
హాజరైన ప్రముఖులు.. పోటెత్తిన భక్తులు
భద్రాద్రి సీతారామ కల్యాణాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, భక్తులు భారీగా తరలివచ్చారు. కరకట్ట, ఆలయ ప్రాంగణం, బస్టాండ్ల నుంచి భక్తులు కల్యాణ మండపం భక్తులతో కిటకిటలాడింది. స్టేడియంలో 32వేల మందితో పాటు బయట.. ఎల్ఈడీ టీవీలో వేల మంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కల్యాణాన్ని వీక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి దంపతులతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, ఎంపీలు పోరిక బలరాం నాయక్, వద్దిరాజు రవిచంద్ర తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.