రూ.8 కోట్ల బకాయిలు!.. సరెండర్​లీవ్స్, టీఏ, డీఏ ఏరియర్స్​ కోసం భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదురుచూపులు

  • ఇతర జిల్లాల్లో చెల్లింపులు.. ఇక్కడ మాత్రం పెండింగ్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దాదాపు రూ.8కోట్ల మేర ఉన్న సరెండర్​ లీవ్స్, టీఏ, డీఏ బకాయిల కోసం భద్రాకొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదురుచూస్తున్నారు. మేడారం జాతర సందర్భంగా ములుగు జిల్లా పోలీసులకు పది రోజుల కిందట, ఖమ్మం జిల్లా పోలీసులకు నాలుగు రోజుల కిందట బకాయిలు చెల్లించారు. కానీ ఇక్కడ మాత్రం ఇంకా ఇవ్వలేదు. 

రెండేండ్లుగా.. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దాదాపు 1300 మంది వరకు పోలీసులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వీరికి నాలుగు సరెండర్​ లీవ్స్​ చెల్లించాల్సి ఉంది. దాదాపు రెండేండ్లుగా బకాయిలున్నాయి. ఒక్కో పోలీస్​కు రూ. లక్ష నుంచి రూ. 2.50 లక్షలు మేర బకాయిలు రావాల్సి ఉంది. టీఏ బకాయిలు గతేడాది నుంచి ఉన్నాయి. ఒక్కొక్కరికీ18నెలల టీఏ బకాయిలు దాదాపు రూ. 30వేల నుంచి రూ. 40వేలకు పైగా రావాల్సి ఉంది. డీఏ ఏరియర్స్​ ఏడాదిన్నరవి రావాల్సి ఉంది. ఒక్కొక్కరికీ రూ. 30వేల నుంచి రూ. 50వేలు చెల్లించాలి. 

డిలేపై అసహనం.. 

మేడారం జాతర సందర్భంగా ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క చొరవతో ఆ జిల్లా పోలీసులకు సరెండర్​ లీవ్స్, టీఏ, డీఏ బకాయిలను ఉన్నతాధికారులు పది రోజుల ముందు చెల్లించారు. ఇదే క్రమంలో ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న పోలీసులకు రెండు సరెండర్​ లీవ్స్​గతంలో చెల్లించగా, నాలుగు రోజుల కింద మిగతా రెండు సరెండర్​ లీవ్స్​ను చెల్లించారు. తమకెప్పుడు చెల్లిస్తారోనంటూ ఇక్కడి పోలీసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నిత్యం  ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఏజెన్సీలో నక్సల్స్​ ప్రభావిత ప్రాంతంలో పనిచేస్తున్న  తమకు బకాయిల చెల్లింపులలో జాప్యం జరుగుతుండడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి వరదలప్పుడు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్యూటీలు చేస్తున్నామని, తమ సమస్య పట్ల ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. 

డిప్యూటీ సీఎం భట్టికి వినతి

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న పోలీసులకు సరెండర్​ లీవ్స్, డీఏ, టీఏ బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు పోలీస్​అధికారులు ఆదివారం కొత్తగూడెం వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. సరెండర్​ లీవ్స్, డీఏ, టీఏ బకాయిలు ఒక్కొక్కరికీ దాదాపు రూ.లక్ష నుంచి రూ. 3లక్షల వరకు రావాల్సి ఉందని వివరించారు. ఇతర జిల్లాల్లో బకాయిలు చెల్లించారని, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మాత్రమే పెండింగ్​లో పెట్టారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.