భద్రాద్రి బీఆర్ఎస్​లో లుకలుకలు

  •     చిచ్చు రేపిన రేగా మీటింగ్
  •     పొంగులేటి వర్గం సీరియస్
  •     పార్టీ హైకమాండ్​కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి

భద్రాచలం, వెలుగు: భద్రాచలం బీఆర్ఎస్​లో లుకలుకలు బయటపడ్డాయి. తుమ్మల వర్గీయులతో ప్రభుత్వ విప్  రేగా కాంతారావు ఇటీవల నిర్వహించిన మీటింగ్ పార్టీని రెండుగా చీల్చింది. భద్రాచలం పట్టణ శివారులోని ఏపీలో ఉన్న ఎటపాకలో ఓ రిటైర్డ్ ఎంప్లాయ్​ ఇంట్లో తుమ్మల అనుచరులతో ఆయన భేటీ అయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడైన ఆయన స్థానికంగా ఉన్న లీడర్లను కలుపుకుని పోకుండా ఏకపక్షంగా మీటింగ్​లకు హాజరవుతున్నారనేది ప్రధాన ఆరోపణ. 

దీనిపై ఆగ్రహించిన భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్  లీడర్లంతా అత్యవసర సమావేశం పెట్టారు. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాలకు చెందిన మండల అధ్యక్ష, కార్యదర్శులు హాజరై నియోజకవర్గం డెవలప్​మెంట్​కు తమ పార్టీ ప్రజాప్రతినిధులు ఫండ్స్​ తేవడం లేదని దుయ్యబట్టారు. ఈ మీటింగ్​కు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు నియోజకవర్గ ఇన్​చార్జి డా.తెల్లం వెంకట్రావ్  హాజరయ్యారు. 

పెత్తనం చేస్తే ఊరుకోం..

నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా పెత్తనం చేస్తే ఊరుకోబోమని పరోక్షంగా పార్టీ జిల్లా అధ్యక్షుడికే అల్టిమేటం జారీ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. పొంగులేటి అనుచరులుగా ముద్రపడిన లీడర్లంతా కలిసి మీటింగ్ పెట్టి ఈ వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్​లో అంతర్గత కుమ్ములాటలు బయటపడినట్లైంది. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలపైనా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రూపులు లేని చోట గ్రూపులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. భద్రాచలం నియోజకవర్గంలో కరకట్టల అభివృద్ధికి రూ.17 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చినా పైసా ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ రోడ్డులో సెంట్రల్ లైటింగ్​కు రూ.14 కోట్ల ప్రపోజల్స్​కు సీఎం ఆమోద ముద్ర వేసినా ప్రజాప్రతినిధులు ఫండ్స్​ తేలేకపోతున్నారని అంటున్నారు. ఒక్క సమస్యను కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఈ వ్యవహారంపై లీడర్లంతా కలిసి కేటీఆర్​ను కలుస్తామని చెబుతున్నారు. 

గ్రూపులు పెడితే సహించేది లేదు..

నియోజకవర్గంలో గ్రూపులు పెడితే సహించేది లేదని నియోజకవర్గ ఇన్​చార్జి డా.వెంకట్రావ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లీడర్లు ఎవరైనా నియోజకవర్గంలో తనకు తెలియకుండా సభలు, సమావేశాలు నిర్వహించవద్దని అన్నారు. పార్టీ మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులకు పర్యటన వివరాలు చెప్పాలని సూచించారు. ఇటీవల కొందరు తనకు తెలియకుండా మీటింగ్​లు పెట్టినట్లు తెలిసిందన్నారు. ఈ విషయమై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్​కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఇక్కడ పార్టీ బలంగా ఉందని, గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని రెండు ముక్కలు చేయడాన్ని సహించనని తెలిపారు. భద్రాచలంలో పార్టీయే లేదని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు.

 పార్టీ లేకపోతే సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పీఏసీఎస్  చైర్మన్లు ఎవరని ప్రశ్నించారు. ప్రతీ కార్యకర్తను కాపాడకుంటామని, ఇక్కడికి వచ్చి గ్రూపు రాజకీయాలు చేస్తూ అయోమయానికి గురిచేయొద్దని సూచించారు. మీ నియోజకవర్గాలకు పెద్ద మొత్తంలో నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేసుకుంటున్నారని, భద్రాచలం నియోజకవర్గం గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. మూడేళ్లలో ఎంపీ, మంత్రి, ఇటీవల జిల్లా ప్రెసిడెంట్​గా ఎన్నికైన వారు భద్రాచలం డెవలప్​మెంట్​ కోసం ఒక్క పైసా ఇచ్చారా? అని నిలదీశారు. తుమ్మల వర్గీయులతో రేగా నిర్వహించిన మీటింగ్ భద్రాచలం బీఆర్ఎస్  పార్టీలో కుమ్ములాటలకు తెరలేపిందని అంటున్నారు.