- సర్కారు నుంచి రెస్పాన్స్కరువు
- వరదలను ఎదుర్కోవడంపై చర్యలు శూన్యం!
- భయపడుతున్న పట్టణవాసులు
- ఐటీసీ, సింగరేణిలే దిక్కు!
భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణానికి గోదావరి కరకట్ట నిర్వహణ కోసం ఇరిగేషన్ఆఫీసర్లు పంపిన ప్రతిపాదనలు సర్కారు వద్దనే మూలుగుతున్నాయి. దాదాపు రూ.13కోట్లు అవసరం ఉందని వారు ప్రపోజల్స్‌లో పేర్కొన్నారు. అయితే సర్కారులో మాత్రం చలనం లేకుండాపోయింది. పట్టణవాసులు మాత్రం గతేడాది మాదిరి గోదావరి నదికి వరదలు వస్తే పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. అందుకు వరదలను ఎదుర్కొనేందుకు కరకట్టల నిర్వహణ కోసం ఎలాంటి చర్యలు ప్రారంభించకపోవడమే కారణం. గతేడాది వరదలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు తీర ప్రాంతవాసులు మరచిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో జిల్లాలోని ఐటీసీ, సింగరేణి సంస్థల వద్ద నీటిపారుదలశాఖ చేతులు చాపాల్సిన దుస్థితి నెలకొంది.
రెండు దశాబ్దాలుగా రక్షణ కవచం
1998లో రూ.15కోట్ల వ్యయంతో ఏటపాక నుంచి భద్రాచలం పట్టణంలోని సుభాష్నగర్కాలనీ వరకు సుమారు7కి.మీల మేర కరకట్టలు నిర్మాణం చేపట్టి 2003లో పూర్తి చేశారు. నాటి నుంచి నేటి వరకు అంటే రెండు దశాబ్దాలపాటు పట్టణానికి వరదల నుంచి కరకట్టలు రక్షణ కవచంలా నిలిచాయి. అయితే వరదల సమయంలో స్లూయిజ్‌లు మూసివేస్తే వర్షం నీరు, పట్టణ డ్రైన్‌వాటర్ కాలనీల్లోకి వస్తున్నాయి. ఇందుకోసం మోటార్లు పెట్టి నీటిని ఎత్తిపోస్తున్నారు. గతేడాది వచ్చిన 71.1 అడుగుల గోదావరి వరద కరకట్టలోని పలు లోపాలను ఎత్తిచూపించింది. స్లూయిజ్‌ల నుంచి విస్తా కాంప్లెక్స్, అశోక్‌నగర్ కొత్తకాలనీ, రెడ్ల సత్రం, అయ్యప్ప కాలనీ, సుభాష్నగర్ల వద్ద వరద నీరు లీక్అవుతోంది. దీంతో ఈ కాలనీలన్నీ జలమయమవుతున్నాయి. వరద నీటి ఉగ్రరూపానికి కట్ట రివిట్మెంట్ కోతకు గురయింది. అయ్యప్పకాలనీ వద్ద కట్టకు బుంగపడింది. నీరు కాలనీలోకి చేరడంతో హుటాహుటిన ఇసుక బస్తాలను వేసి తాత్కాలికంగా ఆపారు. ఏటపాక వద్ద కూడా కట్ట కోతకు గురైంది. ఏటా వరదల సమయంలో ఇక్కడ ఇదే పరిస్థితి. నేటికీ కట్టకు మరమ్మతులు చేయించనే లేదు.
సీఎం ఆదేశంతోనే ప్రపోజల్స్..
గతేడాది వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్‌ను ఐటీడీఏలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కట్టను బలోపేతం చేయాలని, 15 అడుగుల ఎత్తు పెంచాలని కోరారు. స్పందించిన సీఎం కేసీఆర్కరకట్టల నిర్వహణకు ఎస్టీమేషన్పంపాల్సిందిగా ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. కరకట్టల బలోపేతం, ఎత్తు పెంచేందుకు సుమారు రూ.13కోట్ల వరకు నిధులు అవసరమంటూ నీటిపారుదల శాఖ అంచనా వేసింది. స్లూయిజ్‌ల వద్ద సంపులు నిర్మించి, వర్షం, టౌన్ నుంచి వచ్చే నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు, పైపులు ఇతర అవసరాలతో అంచనాల్లో పేర్కొన్నారు. సర్కారుకు కూడా ఈ ప్రతిపాదనలు చేరాయి. కానీ ఇప్పటి వరకు పైసా రాలేదు. సీఎం ఇస్తానన్న రూ.1000కోట్లు ఇవ్వకపోయినా కనీసం కరకట్టల నిర్వహణకు అయ్యే పైసలైనా ఇస్తే భద్రాద్రి ప్రజలు గండం నుంచి బయటపడతారు అనే వాదనలు వినిపిస్తున్నాయి.
నిర్వహణ చేపడతాం..
భద్రాచలం గోదావరి కరకట్ట నిర్వహణ చేపడతాం. ఇప్పటికే సింగరేణి, ఐటీసీ సంస్థలను సాయం అడిగినం. వారి ద్వారా వరదల సమయంలో పెద్ద పెద్ద మోటార్లు ఏర్పాటు చేసి నీటిని ఎత్తి పోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నం. కరకట్టల విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు గతంలోనే పంపినం. సర్కారు నుంచే రెస్పాన్స్రావాల్సి ఉంది.
- రాంప్రసాద్, ఈఈ, నీటిపారుదల శాఖ