ముందుకు కదలని కరకట్ట పనులు!

ముందుకు కదలని కరకట్ట పనులు!
  • సర్వేల పేరుతో కాలయాపన
  • నేషనల్​హైవే అథారిటీస్​  కొర్రీలతో తలనొప్పి 
  • ముచ్చటగా మూడోసారి సాయిల్​ టెస్ట్

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం శివారున కూనవరం రోడ్డులో కరకట్ట పనులు ముందుకు సాగడం లేదు. సర్వేల పేరుతో కాలయాపన జరుగుతోంది. నేషనల్​ హైవేను కరకట్టను దాటించే క్రమంలో చేపట్టబోయే ఎలివేటెడ్​ రోడ్డు పనులకు సాయిల్​ టెస్ట్ కావాలంటూ నేషనల్ హైవే అథారిటీ సూచించింది. ఇప్పటికే అనేకసార్లు సాయిల్ ​టెస్టులు చేసి పంపినా కొర్రీలు పెడుతుండటంతో ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​కు తలనొప్పిగా మారింది. నవంబరు నెలలో ఒకసారి బోర్​హోల్​ డిగ్గింగ్​ ద్వారా టెస్ట్ చేసి రిపోర్టు ఇస్తే ఇంకా అక్యురేట్​గా కావాలంటూ పెండింగ్​లో పెట్టారు. 

దీంతో గత నెలలో బ్లూ ఎనర్జీ బిల్డ్ ప్రైవేటు లిమిటెడ్​ సంస్థతో జియో ఫిజికల్​ సర్వే నిర్వహించారు. 1.3 కిమీల పరిధిలో సాయిల్​ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చినా నేషనల్ హైవే అథారిటీ సంతృప్తి చెందలేదు. మరోసారి చేయించాలని పేర్కొనడంతో తిరిగి బోర్​ హోల్​ డిగ్గింగ్​ ద్వారా శనివారం నుంచి సాయిల్​ టెస్ట్ ప్రారంభించారు. 

రూ.40కోట్ల అదనపు నిధులతో పనులు

గతంలో 3.4 కి.మీల కరకట్ట నిర్మాణం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 33 ఎకరాలను సేకరించారు. ఇందులో 700 మీటర్ల మేర పనులు ఆగిపోయాయి. వాటిని కొత్తగా వచ్చిన కాంగ్రెస్​సర్కారు చేపట్టింది. రూ.38కోట్లతో పనులు ప్రారంభించారు. 2024 జూన్​నెలలో నేషనల్ హైవేస్ ​ఇంజినీర్​ఇన్​ చీఫ్​ గణపతిరెడ్డి కరకట్టను నేషనల్ హైవే దాటిస్తున్నందున ఈ పనులు పరిశీలనకు వచ్చారు. ఎలివేటెడ్​ రోడ్డు నిర్మాణం తప్పనిసరి అంటూ సూచించారు. దీంతో మరో రెండున్నర ఎకరాల భూమిని సేకరించాల్సి వచ్చింది. రూ.40కోట్లతో కరకట్టపై ఫ్లైఓవర్​ తరహాలో ఎలివేటెడ్​ రోడ్డును నిర్మించాల్సి వచ్చింది. అందుకే నేషనల్​హైవేస్​ అథారిటీస్​ సాయిల్​ టెస్టు రిపోర్టులు అడుగుతోంది. పాత కరకట్ట బేస్​ 53 మీటర్లు ఉండగా కొత్తగా నిర్మిస్తున్నది 65 మీటర్ల వరకు ఉంటుంది. గతంలో కరకట్ట ఎత్తు 12.50 మీటర్లు ఉంటే ఇప్పుడు 13 మీటర్లు ఎత్తు 
ఉంటుంది.

ఈ రిపోర్టు కీలకం

సాయిల్​ టెస్ట్ రిపోర్టు ప్రకారమే ఎలివేటెడ్ రోడ్డుకు పునాది నిర్మాణం జరుగుతుంది. వరదల కారణంగా ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నందున గోదావరి తీరం వెంట ఉన్న ఈ ప్రాంతంలో పునాది నిర్మాణానికి ఎంత లోతులో రాతి పొరలు ఉన్నాయనే విషయం తెలియాలంటే ఈ రిపోర్టు కీలకం. అందుకే జాగ్రత్తలు తీసుకుని ఇన్ని సార్లు టెస్ట్ చేయిస్తున్నాం. తప్పకుండా ఈసారి నేషనల్ హైవేస్ అథారిటీ నుంచి అనుమతులు వస్తాయి. ఈ నెలలోనే పనులు ప్రారంభిస్తాం. 
- రాంప్రసాద్, ఈఈ, ఇరిగేషన్, భద్రాచలం