ఇండ్ల కోసం భద్రాచలం వరద బాధితుల నిరసన

  • ఈ ఏడాది వచ్చిన వరదలతో రోడ్డునపడ్డ 18 వేల కుటుంబాలు 
  • మెట్ట ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న సీఎం కేసీఆర్ 
  • 5 నెలలైనా కనీసం జాగా కూడా చూడలే  

భద్రాచలం, వెలుగు: గోదావరి వరదలతో భద్రాచలం మన్యంలో సర్వం కోల్పోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు. మూడు నెలలుగా అడవిలో దీక్ష చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది వచ్చిన వరదలతో 18 వేల కుటుంబాలు రోడ్డునపడగా.. వాళ్లందరికీ మెట్ట ప్రాంతంలో వెంటనే డబుల్​బెడ్​రూమ్ ఇండ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ సీఎం హామీ ఇచ్చి 5 నెలలవుతున్నా ఇండ్ల పనులు మొదలు కాలేదు. దీంతో సారపాక, పాత సారపాక, సుందరయ్యనగర్, బసప్ప క్యాంపు, భద్రాచలం తదితర ప్రాంతాలకు చెందిన వరద బాధితులు నిరసనకు దిగారు. పిల్లాజెల్లా, వృద్ధులు, గర్భిణులు అనే తేడా లేకుండా బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్​రోడ్డు వద్ద అడవిలోనే డేరాలు, గుడిసెలు వేసుకొని ఆందోళన చేస్తున్నారు. 117 రోజులుగా అక్కడే వంటావార్పు చేసుకుంటూ వంతుల వారీగా దీక్ష కొనసాగిస్తున్నారు. సీఎం చెప్పిన దాన్ని బట్టి ఆరు నెలల్లోనే ఇండ్లు కట్టించి ఇస్తారని భావించామని, కానీ ఇప్పటికీ జాగా కూడా ఫైనల్ చేయలేదని బాధితులు వాపోతున్నారు.  పోలవరం బ్యాక్​వాటర్​వల్ల ఎప్పటికీ వరదలు తప్పవని, ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము ఇండ్లకు పోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ఏడు నెలలు గడిస్తే మళ్లీ వరదలు వస్తాయని, ఈలోగా సర్కార్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

ప్రభుత్వ భూములున్నా కడ్తలేరు..

వరద బాధితులను జులై 17న భద్రాచలంలో సీఎం కేసీఆర్ పరామర్శించారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ఓ మెట్ట ప్రాంతం చూసి, నిర్మాణాలు ప్రారంభించాలని ఆఫీసర్లను ఆదేశించారు. కానీ 5 నెలలైనా నిర్మాణాలకు భూమి కూడా చూడలేదు. బూర్గంపాడు మండలంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. సందెళ్ల రామాపురంలోని సర్వే నంబర్​437, కృష్ణసాగర్​పరిధిలోని సర్వే నంబర్ 10, నాగినేనిప్రోలులోని సర్వే నంబర్ 437లో వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నట్లు రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ వీటిలో చాలా భూములను అటవీశాఖ కలుపుకుందని, జాయింట్​సర్వే నిర్వహిస్తే అవన్నీ బయటకు వస్తాయని అంటున్నారు. వాటిలో ఇండ్లు నిర్మించే అవకాశం ఉన్నా, సర్కార్ ఆ దిశగా ఆలోచించడం లేదు. భద్రాచలం మార్కెట్​లో నిర్మిస్తామని ఆఫీసర్లు మొదట్లో హడావుడి చేయగా, వ్యాపారులు కోర్టుకు వెళ్లడంతో వెనక్కి తగ్గారు.

ఆందోళన కొనసాగిస్తం..

ఇండ్ల కోసం 117 రోజులుగా దీక్షలు చేస్తున్నం. కలెక్టర్, తహసీల్దార్​ను కలిసి వినతిపత్రాలు ఇచ్చినం. కానీ స్పందనే లేదు. సర్కార్ దిగొచ్చేంత వరకూ ఆందోళన కొనసాగిస్తం. -  మోర రవి, న్యూ డెమోక్రసీ సెక్రటరీ, భద్రాచలం డివిజన్​

ఊర్లో ఉండలేం..

మా ఇల్లు పూర్తిగా వరదలో మునిగిపోయింది. వరద సాయం రూ.10 వేలు కూడా ఇవ్వలేదు. పోలవరం వల్ల మేము ఊర్లో బతికే పరిస్థితి లేదు. సర్కార్ వెంటనే స్పందించి ఇండ్లు కట్టించి ఇవ్వాలి. - మమత, 
మేడే కాలనీ, సారపాక

నీట మునిగిన 100 గ్రామాలు.. 

ఏటా గోదావరి వరదలతో మన్యంలోని గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. పోలవరం ఆనకట్టకు గేట్లు బిగించడంతో ఈసారి సమస్య మరీ తీవ్రమైంది. జులై, ఆగస్టులో వచ్చిన భారీ వరదలతో భద్రా చలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణు గూరు, పినపాక, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 100కు పైగా గ్రామాలు నీటమునిగాయి. ఇండ్లు, గుడిసెలు, సామాన్లు వరదలో కొట్టుకుపోయాయి. బాధితులు నెలకు పైగా శిబిరాల్లో తలదా చుకున్నారు. బూర్గంపాడు మండలంలో 7 వేల కుటుంబాలు, అశ్వాపురంలో 1,458, పినపాకలో 1,341, మణుగూరులో 392, దుమ్ముగూడెంలో 1,920, చర్లలో 2,889, భద్రాచలంలో 2,913 కలిపి మొత్తంగా 17,913  కుటుంబాలు వరదలతో రోడ్డున పడ్డాయి.