కార్తీక పౌర్ణమి వేళ.. ఆలయాల కిటకిట

కార్తీక పౌర్ణమి వేళ శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆలయాలు కిటకిటలాడాయి. భద్రాచలంలో గోదావరిలో పుణ్యస్నానాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో గోదావరి కరకట్ట రద్దీగా మారింది. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించి, మహిళలు వాయినాలు ఇచ్చుకున్నారు. శివాలయాల్లో 360 వత్తులను వెలిగించారు. శివయ్యకు అభిషేకాలు, బిళ్వార్చనలు జరిపారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి సుప్రభాత సేవ చేశాక స్వర్ణ కవచాలు అలంకరించారు. లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం చేసి, లక్ష్మీ అష్టోత్తరశతనామార్చన, విష్ణు సహస్ర నామ పారాయణాలు నిర్వహించారు. బేడా మండపంలో సీతారామయ్యలకు నిత్య కల్యాణం, చిత్రకూట మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. సాయంత్రం దర్బారు సేవ అనంతరం అద్దాల మండపంలో సీతారామయ్యకు సంధ్యాహారతినిచ్చారు.  శివాలయాల్లో ఆకాశదీపం వెలిగించి, జ్వాలాతోరణాలు వేడుకగా నిర్వహించారు. భక్తులు జ్వాలా తోరణం కింద నుంచి ప్రదక్షిణలు చేశారు. కార్తీక పౌర్ణమి ఉపవాస దీక్షలను ఆకాశదీపం తిలకించి విరమించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. గేట్​కారేపల్లి శివాలయాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం నగరంలోని గుంటూ మల్లేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.        - భద్రాచలయం, నెట్​వర్క్, వెలుగు