మూడు పంచాయతీలుగా భద్రాచలం..17 ఏండ్ల వివాదానికి తెర.. 

హైదరాబాద్, వెలుగు: భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడు పంచాయతీలుగా విభజించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామాన్ని రెండు పంచాయతీలుగా, ఆసిఫాబాద్‌లో మరొక పంచాయతీని ఏర్పాటు చేసింది. భద్రాచలం పంచాయతీని భద్రాచలం, సీతారాంనగర్, శాంతినగర్ పంచాయతీలుగా విభజించింది. 700.4 ఎకరాల విస్తీర్ణంలో 21 వార్డుల్లో భద్రాచలం పంచాయతీ, 349.77 ఎకరాలు 17 వార్డుల్లో సీతారాం నగర్ పంచాయతీ, 997 ఎకరాలు 17 వార్డుల్లో శాంతినగర్ పంచాయతీని ఏర్పాటు చేసింది. సారపాకలో 1,732 ఎకరాల విస్తీర్ణంలో 17 వార్డుల్లో సారపాక పంచాయతీని, 2,512.18 ఎకరాల విస్తీర్ణంలో 15 వార్డుల్లో ఐటీసీ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసింది. అలాగే, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 185.7 ఎకరాలు 11 వార్డుల్లో రాజంపేట గ్రామ పంచాయతీని విభజించింది.

17 ఏండ్ల వివాదానికి తెర.. 

భద్రాచలం గతంలోనూ గ్రామ పంచాయతీగా ఉండేది. 2005లో భద్రాచలాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏజెన్సీ ప్రాంతంలోని భద్రాచలానికి మున్సిపాలిటీ చట్టం వర్తించదని 2005లో యాసం రాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, ఈ జీవోపై స్టే విధించింది. ఆ తర్వాత పంచాయతీలుగానే కొనసాగిస్తూ ఎన్నికలు నిర్వహించారు. చివరగా అక్కడ 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 2018లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ చేసిన చట్ట సవరణకు గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడంతో ఇటు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరగలేదు. దీంతో స్పెషలాఫీసర్ల పాలనలోనే ఉన్న భద్రాచలం.. ఇటు పంచాయతీల జాబితాలో గానీ, అటు మున్సిపాలిటీగా గానీ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే భద్రాచలంలో స్పెషలాఫీసర్ల పాలనను సవాల్ చేస్తూ 2020లో సొండె వీరయ్య అనే వ్యక్తి హైకోర్టులో మరో పిల్ దాఖలు చేశారు. పాత, కొత్త పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి బెంచ్‌ గురువారం మరోసారి విచారణ చేపట్టింది. 2005లో స్టే ఆదేశాలు వచ్చినా.. ప్రభుత్వం గత 17 ఏండ్లుగా పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో నాలుగు వారాల్లో చెప్పాలని ప్రభుత్వాన్ని నవంబర్ మొదటి వారంలో హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం పంచాయతీల విభజన జీవో జారీ చేసినట్లు తెలిసింది.