ఐటీడీఏలో ఖాళీలిట్ల..పర్యవేక్షణ ఎట్ల?

 ఐటీడీఏలో  ఖాళీలిట్ల..పర్యవేక్షణ ఎట్ల?

భద్రాచలం,వెలుగు: గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీపై రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ నేటికీ దృష్టి సారించడం లేదు. ఫలితంగా ఐటీడీఏ పరిధిలోని గిరిజనాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. రాష్ట్రం ఆవిర్భవించాక ఐటీడీఏలపై సర్కారు శీతకన్ను వేసింది. నిధులు ఇవ్వక, నియామకాలు చేపట్టక గిరిజనుల సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోంది.  అతి ముఖ్యమైన13 పోస్టులు ఖాళీగా ఉండడంతో గిరిజనులకు  ప్రభుత్వ ఫలాలు అందడం లేదు.

సిబ్బంది లేక ఇబ్బంది

ఐటీడీఏలో గిరిజన సంక్షేమశాఖ విద్యావిభాగం ప్రధానమైనది.  దీని పరిధిలో 60 ఆశ్రమ పాఠశాలలు, 22 హాస్టళ్లు, 233 ప్రాథమిక పాఠశాలలు, 34 కళాశాల వసతి గృహాలన్నాయి.  మొత్తం 30,674 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్​ ఉన్న ఈ విభాగానికి ప్రధాన ఆఫీసర్​ డీడీ(డిప్యూటీ డైరక్టర్​). ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఇక విద్యాసంస్థల పర్యవేక్షణ చేసే ఏజెన్సీ డీఈవో పోస్టు ఏళ్ల తరబడి భర్తీ  కావడం లేదు. ఈ రెండూ అతి కీలకమైనవి. 27 గురుకులాలలో 12,460 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిని ఆర్​సీవో పర్యవేక్షించాలి. ఈ పోస్టు కూడా ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంది. కొండరెడ్ల సంక్షేమానికి నియమించిన ఏపీవో(పీటీజీ), ఏపీవో(పవర్​), ఏపీవో(అగ్రికల్చర్​), ఏపీవో (పబ్లిసిటీ), ఏపీవో (ఫిషరీస్​), ఏపీవో(ఎన్​ఆర్​ఈజీఎస్​)ఈ ఆరు పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. 

వైద్యానికి దూరం

ప్రస్తుతం వానాకాలం కావడంతో మన్యంలో వ్యాధులు ప్రబలే  అవకాశాలు ఉన్నాయి. కానీ ఐటీడీఏలో అడిషనల్​ డీఎం అండ్​హెచ్ వో పోస్టు సైతం ఇన్​చార్జి​ చేతుల్లోనే ఉంది. భద్రాచలం ఏరియా ఆస్పత్రి, 8 సామాజిక వైద్య కేంద్రాలు, 38 పీహెచ్​సీలు, 329 సబ్​ సెంటర్లను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారి లేకపోవడం గిరిజన వైద్యానికి శాపంగా మారింది. అడ్మినిస్ట్రేషన్​సెక్షన్​లో మేనేజర్​పోస్టు ఖాళీగా ఉంది. ట్రైబల్​ స్పోర్ట్స్ ఆఫీసర్​ కూడా లేరు. గిరిజన భూ సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన కోర్టులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. మొత్తం 13 ప్రధాన పోస్టుల్లో ఆఫీసర్లు లేక గిరిజనాభివృద్ధి కుంటుపడుతోంది. 

పర్యవేక్షణ భారం

కోట్లాది రూపాయలతో గిరిజన సంక్షేమం కోసం చేపట్టే పథకాల పర్యవేక్షణ ఉన్న కొద్దిమంది ఆఫీసర్లకు భారంగా తయారైంది.  గురుకులాల ఆర్​సీవో, గిరిజన సంక్షేమశాఖ డీడీ(డిప్యూటీ డైరక్టర్​)గా ఈ రెండు పోస్టుల బాధ్యతలను భద్రాచలం ఐటీడీఏ ఏపీవో( జనరల్​) డేవిడ్​రాజ్​మోస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీలతో వచ్చే ఆదివాసీలకు ఆఫీసర్లు లేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చి వెక్కిరిస్తున్నాయి. 

ఆఫీసర్ల కొరతతో ఇవీ ఇబ్బందులు

ఐటీడీఏలో ప్రధాన శాఖల్లో ఆఫీసర్ల కొరత వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమీక్షలు, పర్యవేక్షణ చేయాల్సిన కీలకమైన డీడీ,ఆర్​సీవో  పోస్టులు ఖాళీగా ఉండడంతో గురుకులం, ఆశ్రమ పాఠశాలల్లో అడ్మిషన్లు, నిర్వహణ, హాస్టళ్లకు నిత్యావసర సరుకుల సరఫరా, టెండర్లు అస్తవ్యస్తంగా మారాయి. ఏజెన్సీ డీఈవో లేకపోవడంతో గిరిజన పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఈ ఏడాది టెన్త్ ఫలితాలు కూడా దారుణంగా పడిపోయాయి.  మన్యంలో వర్షాకాలంలో అంటువ్యాధులు, మలేరియాను అరికట్టేందుకు గిరిపల్లెల్లో స్ప్రేయింగ్​, జ్వరపీడితుల నుంచి రక్తనమూనాలు సేకరించి ఎప్పటికప్పుడు పరీక్షలు జరపాలి. వీటికి కావాల్సిన బడ్జెట్​ను తెప్పించుకోవాలి. అడిషనల్ డీఎంఅండ్​హెచ్​వో తప్పనిసరిగా ఉండాలి. కొండరెడ్ల గ్రామాల్లో  సంక్షేమ పథకాలు పరిశీలించాల్సిన ప్రత్యేకాధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో వారికి అవసరమైన పనులు, నిధులు అందడం లేదు.  ఆఫీసర్​ లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్​డీసీ( స్పెషల్ డిప్యూటీ కలెక్టర్​) పోస్టు ఖాళీగా ఉండటం వల్ల ఎల్టీఆర్​ కేసులు పెండింగ్​లో ఉన్నాయి. అవి ఎప్పుడు పరిష్కారం అవుతాయోనని గిరిజనులు ఎదురుచూస్తున్నారు.

గిరిజన సంక్షేమం అంతా ఉత్తిదే...

గిరిజన సంక్షేమం అంతా ఉత్తిదే. నేతి బీరకాయ చందమే. ఆఫీసర్లే లేకుండా పనులు ఎట్లా సాగుతాయి. బాగా వెనుకబడిన కొండరెడ్ల గిరిజనుల సంక్షేమానికి ఏపీవో(పీటీజీ) ఆఫీసర్​ లేనే లేరు. ఇక వారి బాగోగులు ఎవరు పట్టించుకుంటారు..? 
- పాయం సత్యనారాయణ, గోండ్వాన సంక్షేమ పరిషత్​ రాష్ట్ర అధ్యక్షుడు