- లోపాల అన్వేషణ.. దిద్దుబాటుకు ఐటీడీఏ పీవో చర్యలు
- 23 అంశాలతో క్వశ్చనీర్ తయారీ
- సీల్డ్ కవర్లలో టీచర్ల నుంచి సూచనల స్వీకరణ
- చక్కని సూచనలు చేసిన టీచర్లకు సత్కారం
భద్రాచలం, వెలుగు : గిరిజన విద్యపై భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ స్పెషల్‌ఫోకస్ పెట్టారు. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థుల ప్రతిభా పాటవాలపై ఆయన తనిఖీల సమయంలో పలు అంశాలను గుర్తించారు. లోపం ఎక్కడ ఉందిదని ఆయన అన్వేషణ ప్రారంభించారు. కోట్ల రూపాయల బడ్జెట్, ట్రైనింగ్ పొందిన టీచర్లు, సౌకర్యాలు ఉన్నా విద్యాబోధన ఆ స్థాయిలో లేకపోవడాన్ని గుర్తించారు.
అందుకే టీచర్లతోనే ‘ఏం చేస్తే గిరిజన విద్య బలోపేతం అవుతుంది? గిరిజన విద్యను ముందుకు తీసుకెళ్లడానికి నిర్ధిష్టమైన సూచనలు కావాలి’ అని సర్క్యూలర్ జారీ చేశారు. సబ్జెక్టుల వారీగా చక్కటి సూచనలు, విశ్లేషణలు చేసినవారికి టీచర్స్‌డే నాడు బహుమతులు ఇచ్చి, వాటినే అమలు చేయాలని నిర్ణయించారు.తెలుగు భాషా దినోత్సవం వేళ స్టూడెంట్లకు వివిధ పోటీలు పెట్టి బహుమతులు కూడా ఇచ్చారు.
అమలు చేయాల్సినవి ఇవే..
ఆట పాటలతో విద్యార్థిని విద్యపై మక్కువ పెంచుకునేలా తరగతి గదిని తీర్చిదిద్దాలి. నీతి కథలు చెప్పడం, వాటి ద్వారా వారు నేర్చుకున్న నీతి చెప్పించాలి. బట్టి విధానానికి స్వస్తి చెప్పాలి. ప్రతీ సబ్జెక్టు టీచర్ ముందుగానే ప్రిపేర్ అయి వచ్చి బోధన చేయాలి. మానసిక పరిస్థితి కూడా విద్యపై ప్రభావం చూపుతుంది. ఓటముల నుంచి గెలుపు తలుపు తట్టిన వారి స్ఫూర్తిదాయక విషయాలు పిల్లలకు తరగతి గదిలో వివరించాలి.
వెనక బడిన విద్యార్థిని గుర్తించి చదువులో రాణించడానికి ప్రతి స్కూల్లో అకడమిక్ కమిటీ ఏర్పాటు చేయాలి. మ్యూజికల్ టీచర్ ఉండాలి. ఒత్తిడిని జయించడానికి యోగా టీచర్ ఏర్పాటు చేయాలి. గిరిజన సంప్రదాయ పండుగలు స్కూళ్లలో నిర్వహించాలి. ఇంటి బెంగ తీరి హాజరు శాతం పెరగాలంటే ప్రతినెలా పేరెంట్స్ మీటింగ్ పెట్టాలి. హాస్టళ్లలో ఇంటి వాతావరణం కల్పించాలి.
పక్కాగా అమలు చేస్తాం
టీచర్ల నుంచి మంచి సూచనలు, సలహాలు వచ్చాయి. గిరిజన స్టూడెంట్ల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మంచి విద్యావిధానం తీసుకొస్తాం. టీచర్ల పాత్ర ఇందులో ఎంతో కీలకం. తల్లిదండ్రుల సహకారం కూడా కావాలి. పునాదులు పటిష్టపరిచి ప్రతీ స్టూడెంట్ను తీర్చిదిద్దుతాం. - బి.రాహుల్, ఐటీడీఏ పీవో, భద్రాచలం