
బూర్గంపహాడ్, వెలుగు : గిరిజన రైతులు ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ సూచించారు. మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన గోపాలపురానికి మంగళవారం ఆయన 3 కిలోమీటర్ల దూరం నడిచివెళ్లి పంటపొలాలను పరిశీలించారు. తమకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం లేదని, అందుకు వర్షాధార పంటల పైనే ఆధారపడుతున్నామని గిరిజన రైతులు పీవో దృష్టికి తెచ్చారు. దీనికి పీవో స్పందిస్తూ ఈ పంట పొలాలకు కరెంటు సౌకర్యం కల్పించడానికి ఆటంకాలు ఏమున్నాయని ఫారెస్ట్, విద్యుత్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గిరిజన రైతుల దుస్థితిని అర్థం చేసుకొని అడవి నష్టపోకుండా, జంతువులకు హాని కలగకుండా కరెంట్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పోడు పట్టా ఉన్న రైతులకు మాత్రమే కరెంటు సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. గిరిజన రైతులు పామ్ ఆయిల్, పండ్లతోటలు, మునగ చెట్లు, చేపల చెరువులు ఏర్పాటు చేసుకొవాలని, వీటి ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ సందపాదన వస్తుందని తెలిపారు.
గిరిజనులు అటవీ ఫలాలను సేకరిస్తే ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేసి గిరిజనులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. చదువుకున్న గిరిజన యువత ఆసక్తితో ముందుకు వస్తే ఇప్ప పువ్వు ద్వారా నూనె తీసే యంత్రం యూనిట్ ను సబ్సిడీ ద్వారా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్, విద్యుత్ శాఖ అధికారులు శ్రీనివాస్, సురేశ్ మునీర్ పాషా పాల్గొన్నారు.