భద్రాచలంలో తలోదిక్కున మార్కెట్లు.. 19 ఏండ్లుగా ఒక్కచోటికి తీసుకురాలేకపోతున్న అధికారులు

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో వేర్వేరు చోట్ల కొనసాగుతున్న మార్కెట్లను అధికారులు ఒక్కచోటికి తీసుకురాలేకపోతున్నారు. 19 ఏండ్ల కింద భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రం టౌన్​షిప్​గా ఉన్నప్పుడే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చర్ల రోడ్డులోని బీఎడ్ కాలేజీ ఎదుట 10 ఎకరాల భూమిలో కొత్త మార్కెట్​నిర్మించింది. తర్వాత పంచాయతీ నిధులతో షాపింగ్​కాంప్లెక్స్​లు నిర్మించారు. ఐటీడీఏ, చర్ల రోడ్లలో కొనసాగుతున్న చికెన్, మటన్​షాపులు, కూనవరం రోడ్డులోని ఫిష్​మార్కెట్ ను, జూనియర్​కాలేజీ ఎదురుగా ఉన్న పాతమార్కెట్​లోని షాపులను వీటిలోకి షిఫ్ట్​చేయాలని నిర్ణయించినా ఏండ్లుగా వ్యాపారులు కదలడం లేదు.

ప్రస్తుతం పాతమార్కెట్ ఏరియాలో కొనసాగుతున్న హోల్​సేల్​షాపుల వద్ద డైలీ ట్రాఫిక్​జామ్​అవుతోంది. అదే ఏరియాలో బ్యాంకులు ఉండటంతో రోజంతా రద్దీగా ఉంటోంది. పైగా షాపులకు వచ్చే హెవీ వెహికల్స్​తో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల మధ్య చికెన్, మటన్ షాపులు నడుస్తుండటం, వ్యర్థాల కంపును భరించలేకపోతున్నారు. కాగా, పైరవీలు చేసి కొందరు కొత్త మార్కెట్​లోని ఖాళీ షాపులను తీసుకున్నారు. కనీసం రెంట్లు కూడా కట్టడం లేదు. అధికార పార్టీకి చెందిన లీడర్ల అనుచరులే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. 

అడ్డుకుంటున్న పైరవీకారులు

2004లో నిర్మించిన కొత్తమార్కెట్ లో చికెన్, మటన్, ఫిష్​ మార్కెట్​కోసం ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. బోరు సదుపాయం ఉంది. సుమారు రూ.1.50కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ లైన్లు వేశారు. కొత్త మార్కెట్ ముందు భాగంలో 45 షాపులు, వెనుక భాగంలో ఎడమ వైపు 23, కుడివైపు 5 షాపులు కట్టారు. ప్రభుత్వ ప్లాన్​ప్రకారం భద్రాచలంలోని హోల్​సేల్, రిటైల్, కూరగాయలు, ఫ్రూట్స్, చికెన్, మటన్, ఫిష్​షాపులన్నీ ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడే రైతు బజార్ ను కూడా నిర్మించాలని పంచాయతీ పాలకమండలి తీర్మానం చేసింది. కానీ ఏండ్లుగా పాత కూరగాయల మార్కెట్​లోని హోల్​సేల్ వ్యాపారులు అక్కడి నుంచి కదలడం లేదు. పంచాయతీ ఆఫీసర్లు తరలించాలని చూసినా రాజకీయ నాయకులు, పైరవీకారులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు.

ఫారెస్ట్ ఆఫీస్​ముందు ఉన్న ఫ్రూట్​షాపులను ముట్టుకుంటే వివిధ పార్టీల లీడర్లు వచ్చి వాలిపోతున్నారు. నేషనల్ హైవేను కబ్జా చేసి ఫుట్​పాత్​ల పైనే వ్యాపారం చేస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఫారెస్ట్ ఆఫీసర్లు సైతం కబ్జాలను అడ్డుకున్నారు. పాతమార్కెట్​రోడ్డులో రాత్రి, పగలు తేడా లేకుండా భారీ వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి లోడింగ్, అన్​లోడింగ్ చేస్తున్నారు.

ఎంత చెప్పినా కదలడం లేదు

పాతమార్కెట్​లోని వ్యాపారులు అక్కడి నుంచి కదలడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. ఇబ్బందిగా ఉన్న మాట వాస్తవమే. వారంతా కొత్తమార్కెట్ కు షిఫ్ట్​అవ్వాలి. అక్కడ అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయి. అన్నిరకాల షాపులు ఒకేచోట ఉంటే వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.– వెంకటేశ్వర్లు, ఈఓ, గ్రామ పంచాయతీ

అధికారుల నిర్లక్ష్యంతోనే మారట్లే

ఊళ్లోని మార్కెట్లన్నింటిని ఒకచోటికి తీసుకురావాలి. వినియోగదారులతోపాటు వ్యాపారులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 2004లో అప్పటి ప్రభుత్వం కొత్త మార్కెట్​నిర్మించింది. కానీ వ్యాపారులు షాపులను షిఫ్ట్​చేయడం లేదు. ప్రస్తుతం పాత మార్కెట్ ఏరియాలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే షాపుల షిఫ్టింగ్​లేట్​అవుతోంది. పట్టించుకోకపోతే ఉద్యమిస్తాం.

అజీమ్, మహబూబాబాద్​ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి