- భద్రాచలంలో పెట్రోలు డబ్బాలతో
- ఆమరణ దీక్షకు దిగిన 7 కుటుంబాలు
భద్రాచలం, వెలుగు: డబుల్బెడ్రూమ్ఇండ్లు కేటాయించాలని డిమాండ్చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మనుబోతుల చెరువు వద్ద ఏడు కుటుంబాలు పెట్రోలు డబ్బాలతో సోమవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. గతేడాది ఆగష్టు నెలలో మనుబోతుల చెరువుకు సమీపంలోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటున్న తమను రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించారని తెలిపారు.
ఆ టైంలో తమకు న్యాయం చేస్తామని, డబుల్ ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇటీవల స్థానికంగా కడుతున్న ఇండ్లు కేటాయించాలని కోరుతూ అప్లికేషన్ ఇచ్చేందుకు తహసీల్దార్ఆఫీసుకు వెళ్తే అవమానించారని ఆరోపించారు. అధికారులు ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. మూడు రోజులుగా దీక్షలు చేస్తున్నా స్పందించకపోవడంతోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు స్పష్టం చేశారు.
ఇండ్లు కేటాయించకపోతే పెట్రోలు పోసుకుని సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని తేల్చిచెప్పారు. దీక్షలో బాధితులు మేకల లత, కొచ్చర్ల కుమారి, తెల్లం సమ్మక్క, ఇల్లందుల హేమలత, మిర్యాల రమాదేవి, నీలాల కృష్ణవేణి, గుండె సుహాసిని పాల్గొన్నారు.