భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మూలవరులకు తిరుమంజనం నిర్వహించి బాలబోగం నివేదించాక బంగారు పుష్పాలతో అర్చన చేశారు. అభిషేకంతో పాటు సువర్ణ పుష్పార్చనలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ప్రాకార మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరిగింది. 84 జంటలు కంకణాలు ధరించి క్రతువు నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం సమర్పించడంతో క్రతువు ముగిసింది. మాధ్యాహ్నిక ఆరాధన తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. కాగా కార్తీక మాసం సందర్భంగా చిత్రకూట మండపంలో సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. ఇదిలాఉంటే హైదరాబాద్ నిజాంపేటలో వజ్ర నిర్మాణ్ పుష్పక్ అపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రభాకరశర్మ సీతారాముల కల్యాణ వేడుకను నిర్వహించారు. దేవస్థానం తరుపున రామరథంలో స్వామి కల్యాణమూర్తిని అర్చకులు హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడి భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణం నిర్వహించారు.
స్టూడెంట్ను చితకబాదిన ఘటనపై విచారణ
అశ్వారావుపేట, వెలుగు: బీసీ గురుకుల బాలుర పాఠశాలలో ఫుడ్ బాగోలేదన్నందుకు 9వ తరగతి స్టూడెంట్ చేతన్ రెడ్డిని పీఈటీ సురేశ్ కుమార్ చితకబాదిన విషయంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీవో జ్యోతి ఆదివారం విచారణ చేపట్టారు. హెచ్ఎం మల్లికార్జునరావు, స్టూడెంట్స్ తో మాట్లాడి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పీఈటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూడెంట్స్ తో గేమ్స్ ఆడించాలే తప్ప కొట్టడమేమిటని ప్రశ్నించారు. ఘటనపై రిపోర్టు అందించనున్నట్లు ఏసీవో తెలిపారు.
పెద్దమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
పాల్వంచ,వెలుగు: మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దేవస్థానం ఆవరణలోని శివలింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ పూజలో ఈవో సులోచన, సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసం తొలి ఆదివారం కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకొనేందుకు భారీగా తరలివచ్చారు.
ప్రభుత్వ భూమిని కాపాడాలి
వైరా, వెలుగు: పట్టణంలోని ఐదో వార్డులో ప్రభుత్వ భూమి(గుట్ట) ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు ఆదివారం గుట్టను, ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకురాలు బానోత్ విజయబాయి మాట్లాడుతూ గుట్టను ఆక్రమించి తప్పుడు ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. 277.5 గజాల భూమిని 709.5 గజాలుగా మున్సిపాలిటీలో ముటేషన్ చేసిన అప్పటి మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. గుట్ట చుట్టూ ఉన్న భూమిని ఆక్రమించుకుంటున్నారని చెప్పారు. రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని హద్దులు ఏర్పాటు చేయాలని, తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యామాల గోపాలరావు, మిట్టపల్లి రాఘవరావు, భండారుపల్లి ముత్తయ్య, గారపాటి అశోక్, కొండ రామకృష్ణ, తిరుమలయ్య, దొబ్బల కృష్ణయ్య, మాచర్ల నాగభూషణం పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: యువ న్యాయవాదులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ అనురాధ సూచించారు. కొత్తగూడెం కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్, తెలంగాణ జూనియర్ న్యాయవాదుల ఫోరం ఆధ్వర్యంలో యువ న్యాయవాదులకు వ్యక్తిత్వ వికాసంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృత్తి రీత్యా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే లాయర్లు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని సూచించారు. సమయపాలన, ఆత్మ విశ్వాసం, ఒత్తిడి నిర్వహణ, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనుబోలు రాంప్రసాద్, ఆల్ ఇండియా లాయర్స్ యునియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేశ్‌కుమార్ మక్కడ్, బార్ అసోసియేషన్ కోశాధికారి మహ్మద్ సాదిక్ పాషా, లైబ్రరీ సెక్రటరీ ఆర్తి మక్కడ్, ఉదయభాస్కర్, గంట వీరభద్రం, కిలారు పురుషోత్తం, నాగేశ్వర రావు పాల్గొన్నారు.
బ్రిడ్జి పనులు పూర్తి చేయండి
సుజాతనగర్, వెలుగు: ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రూ. 6.28 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి పనులు స్లోగా జరుగుతున్నాయి. మండల కేంద్రం నుంచి సీతంపేట, బంజర వెళ్లే మార్గంలో ఎదుళ్ల వాగుపై ఉన్న పాత బ్రిడ్జిపై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగేది. వానొచ్చిన ప్రతీసారి వాగు పొంగడం, రాకపోకలు నిలిచిపోడం కామన్‌గా మారింది. సమస్యను గుర్తించిన ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి రూ. 6.28 కోట్లను మంజూరు చేసింది. కాంట్రాక్టర్ పనులు చేపట్టి పిల్లర్లు నిర్మించేందుకు వాగులో గుంతలు తవ్వారు. ఇటీవల వర్షాలతో వరద నీరు ఒక వైపు నిలిచిపోవడంతో పాత బ్రిడ్జి పిల్లర్లకు సపోర్టుగా ఉన్న కాంక్రీట్‌ను తొలగించారు. దీంతో పాత బ్రిడ్జి కుప్ప కూలింది. కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు స్పీడ్‌గా జరగకపోవడం, పాత బ్రిడ్జి కూలడంతో సీతంపేట, బంజర తదితర గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. పనులు పిల్లర్ల స్థాయిలోనే ఉండడంతో ఉన్నతాధికారులు కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అయినా పనులు ముందుకు సాగకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వంట మనుషులుగా టీచర్లు, స్టూడెంట్స్
దమ్మపేట/గుండాల, వెలుగు: జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌లో పని చేస్తున్న డైలీ వేజ్ కార్మికులు పెండింగ్ వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో శనివారం నుంచి సమ్మె చేపట్టారు. ఇందులోభాగంగా దమ్మపేట మండలం గుళ్లగూడెం కార్మికులు వంట చేయకుండా పాఠశాల ముందే దీక్షకు దిగారు. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు స్కూల్ టీచర్లు 300 మంది స్టూడెంట్స్‌కు వంట చేసి భోజనం పెట్టారు. గుండాల మండలం మామకన్ను ఆశ్రమ హాస్టల్లో పని చేస్తున్న వర్కర్లు సమ్మెకు దిగడంతో స్టూడెంట్స్ వంట చేస్తున్నారు .
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఫస్ట్
వైరా, వెలుగు: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ చెప్పారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో కొణిజర్ల తహసీల్దార్ సైదులు, వైరా డిప్యూటీ తహసీల్దార్ రాముతో కలిసి వైరా టౌన్, వైరా రూరల్, కొణిజర్ల మండలాలకు చెందిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్, రత్నం, సీతారాములు పాల్గొన్నారు.
పెట్టుబడిదారులకు మేలు చేస్తున్రు
పాల్వంచ, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు మేలు చేస్తు న్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం చండ్ర రాజేశ్వరరావు భవన్ లో ఏఐటీయూసీ పట్టణ 9వ మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంస్థలను కేంద్రం అమ్మేస్తోందని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా, ఏఐటీయూసీ పట్టణ కార్య దర్శి అన్నారపు వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, ముత్యాల విశ్వనాథం, బండి నాగేశ్వరరావు, వీసంశెట్టి పూర్ణ, అడుసుమల్లి సాయిబాబు, జ్యోతుల రమేశ్ పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా వీసంశెట్టి విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా అన్నారపు వెంకటేశ్వర్లుతో పాటు 55 మంది సభ్యులతో కార్యవర్గం ఎన్నికైంది.
‘అండగా ఉంటా అధైర్యపడొద్దు’
గుండాల, వెలుగు: ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూముల సర్వేలో అన్యాయం జరగకుండా అండగా ఉండి పట్టాలిప్పిస్తానని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భరోసా ఇచ్చారు. ఆదివారం మండలంలోని శెట్టిపల్లి,శంభునిగూడెం పంచాయతీల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పల్లెల్లో రోడ్లు సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. శెట్టిపల్లి,శంభునిగూడెం మీదుగా కొమరారం వరకు రోడ్డు నిర్మించేలా చూడాలని కోరారు. ఐటీడీఏ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఆగిపోయిన రోడ్డు పనులు పూర్తయ్యేలా చూస్తానని చెప్పారు. ఎస్కే ఖదీర్, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, దారా అశోక్, సర్పంచ్ పూనెం సమ్మయ్య, ఉప సర్పంచ్ మోకాళ్ల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ కల్తి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ చాంపియన్ గా నల్గొండ
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు:
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కబడ్డీ చాంపియన్ షిప్ ట్రోఫీలో నల్గొండ విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో పురుషుల విభాగంలో రంగారెడ్డి జట్టుపై నల్గొండ జట్టు విజయం సాధించింది. మహిళల విభాగంలో రంగారెడ్డి జట్టుపై నల్గొండ జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు పొంగులేటి ట్రోఫీతో పాటు రూ. లక్ష చొప్పున నగదు బహుమతిని అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన రంగారెడ్డి జట్లకు రూ.75 వేల చొప్పున నగదు బహుమతిని అందించి అభినందించారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె జగదీశ్వర్ యాదవ్, డీవైఎస్ వో పరంధామిరెడ్డి, కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఏసీపీ ప్రసన్న కుమార్ ట్రస్ట్ బాధ్యులు మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, మద్దినేని బేబి స్వర్ణకుమారి పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు పట్టణ ప్రజలు భారీగా
తరలివచ్చారు.
ఉత్కంఠగా వాలీబాల్ పోటీలు
భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఆదివారం పలు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగాయి. పోటీలను పీఎస్ఆర్ ట్రస్ట్‌కు చెందిన కంచర్ల చంద్రశేఖర్, ఆళ్ల మురళి, వూకంటి గోపాల్‌రావు, రజాక్, నాగేంద్ర త్రివేది ప్రారంభించారు. వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల రమేశ్ బాబు, కార్యదర్శి హనుమంతరెడ్డి, గోవింద్‌రెడ్డి, ఉస్మాన్, గణపతి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
మూడో రోజు విజేతలు వీరే..
బాలుర విభాగంలో ఖమ్మం, హైదరాబాద్ మధ్య జరిగిన పోరులో 3–1 తేడాతో ఖమ్మం విజయం సాధించింది. కరీంనగర్, మెదక్ జట్ల మధ్య పోటీలో కరీంనగర్ గెలవగా, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగిన పోరులో 3–0 తేడాతో మహబూబ్‌నగర్ విజయం సాధించింది. వరంగల్, నల్గొండ జట్ల మధ్య జరిగిన పోరులో 3–0తో వరంగల్ జట్టు గెలిచింది. బాలికల విభాగంలో రంగారెడ్డి, మెదక్ జట్ల మధ్య జరిగిన పోరులో 3–0 తేడాతో రంగారెడ్డి విజయం సాధించగా, నల్గొండ, హైదరాబాద్ జట్ల మధ్య పోరులో 3–0 తేడాతో నల్గొండ గెలిచింది. ఖమ్మం, ఆదిలాబాద్ జట్ల మధ్య పోరులో ఖమ్మం గెలవగా, మహబూబ్‌నగర్, కరీంనగర్ జట్ల మధ్య జరిగిన పోటీలో 3–0 తేడాతో మహబూబ్‌నగర్ జట్టు విజయం సాధించింది.
మసీద్ కాంప్లెక్స్ నిర్మాణానికి విరాళం
మధిర, వెలుగు: మున్సిపాలిటీ పరిధిలోని మసీదు కాంప్లెక్స్ నిర్మాణానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఆదివారం దెందుకూరు సమీపంలోని శ్రీరస్తు కల్యాణ మండపంలో మదర్సా పిల్లలు ఖురాన్ పఠనం చేసిన సందర్భంగా వారిని సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ కోట రాంబాబు, దేవిశెట్టి రంగారావు పాల్గొన్నారు.