
భద్రాచలం, వెలుగు : ఈనెల 9న భద్రాచలంలోని ఇందిరామార్కెట్లో ఒక మహిళ మెడలోంచి దొంగలు ఎత్తుకెళ్లిన 64 గ్రాముల బంగారాన్ని భద్రాచలం పోలీసులు సోమవారం రికవరీ చేశారు. కేసు వివరాలను ఏఎస్పీ విక్రాంత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఇందిరా మార్కెట్ ఏరియాలో కిరాణా కొట్టుకు ఈనెల 9న ఉదయం వచ్చిన దొంగలు వస్తువులు కొంటున్నట్లు నటించి ఒక్కసారిగా మహిళా మెడలోని బంగారు నాను తాడు, నల్లపూసల గొలుసును లాక్కుని పారిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ బి.రమేశ్, ఎస్సై రామకృష్ణతో రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, సోమవారం భద్రాచలం గోదావరి బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. విచారించగా మొత్తం ముగ్గురు యువకులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. ముగ్గురిని అరెస్ట్ చేసి , వారి నుంచి 64 గ్రాముల విలువ చేసే నాను తాడు, నల్లపూసల గొలుసులను, బైక్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకున్న సీఐ బి.రమేశ్, ఎస్సై బి.రామకృష్ణ, కానిస్టేబుళ్లు రామారావు, లక్ష్మణ్, సతీశ్, హోంగార్డు తిరుపతిని ఏఎస్పీ ప్రశంసించారు.