ఎట్టకేలకు రామాలయంలో .. సోలార్ ప్రాజెక్టు పూర్తి

  • నెట్​ మీటర్​ ఇచ్చేందుకు ప్రాజెక్టును పరిశీలించిన  ట్రాన్స్ కో ఆఫీసర్లు
  • సోలార్  ప్రాజెక్టుతో నెలకు 2.80 లక్షల కరెంటు బిల్లు ఆదా 

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో మూడేళ్ల పాటు ఊరించిన సోలార్  ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తయింది. హైదరాబాద్ కు చెందిన సన్​టెక్నాలజీస్​ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతం టీఎస్​ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా సోలార్​ వెలుగులను అందిస్తున్న సంస్థ ఇదే. రూ.2.50 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును సన్​టెక్నాలజీస్​ సంస్థ చేపట్టింది. అయితే, మధ్యలో సంస్థ ప్రతినిధి అకాల మరణం చెందడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేక్  పడింది. తర్వాత దేవస్థానం సంస్థతో చర్చలు జరిపి తిరిగి ప్రాజెక్టును గాడిలో పెట్టింది. నెల రోజుల పాటు సౌమిత్రీ సదనం, మిథిలా స్టేడియం పైభాగాల్లో సోలార్  ప్యానెళ్ల నిర్మాణం పూర్తి చేశారు. సోలార్​ ప్రాజెక్టు చేపట్టాలంటే ట్రాన్స్ కో నెట్​ మీటర్​ను మంజూరు చేయాలి. మూడు రోజుల క్రితం ఈ మీటర్​ కోసం సన్  టెక్నాలజీస్​ సంస్థ అప్లికేషన్​ ఇవ్వడంతో శుక్రవారం ట్రాన్స్ కో ఏడీఈ, సిబ్బంది సోలార్​ ప్రాజెక్టును పరిశీలించారు. నెలకు సుమారు 400 కిలోవాట్లకు పైగా విద్యుత్తు  సీతారామచంద్రస్వామి దేవస్థానానికి అవసరమవుతుంది. 

యూనిట్​కు రూ.4.80 చొప్పున దేవస్థానం చెల్లిస్తే సరిపోతుంది. 25 ఏళ్లపాటు ప్రాజెక్టు నిర్వహణ చేపట్టే సదరు సంస్థకు దేవస్థానం డబ్బులు చెల్లిస్తుంది. నిర్మాణం, నిర్వహణ బాధ్యత మొత్తం ఈ సంస్థదే. ప్రస్తుతం గతంలో యూనిట్ కు రూ.9 చొప్పున ట్రాన్స్ కోకు దేవస్థానం చెల్లిస్తోంది. కాగా, ఏప్రిల్​ నుంచి ట్రాన్స్ కో కూడా దేవస్థానానికి మినహాయింపు ఇచ్చి రూ.5 యూనిట్​  వసూలు చేస్తోంది. నెట్​ మీటర్​ రాగానే రామా, సీతా నిలయాల్లో సోలార్​ వెలుగుల ప్రాజెక్టు ప్రారంభిస్తామని టెంపుల్​ ఈఈ వేగిశ్న రవీందర్​ రాజు తెలిపారు. 

కాగా, రాష్ట్రంలో తొలి సోలార్​ ప్రాజెక్టు ఉన్న టెంపుల్​గా సీతారామచంద్రస్వామి రికార్డులకు ఎక్కనుంది. ఇప్పుడు దేవస్థానం నెలకు రూ.7 లక్షల చొప్పున ఏడాదికి రూ.84 లక్షలు కరెంట్​ బిల్లు కడుతోంది. రామాలయం, నిత్యాన్నదాన సత్రంతో పాటు 27 కాటేజీలు, 140 గదులకు ఈ ఖర్చు అవుతున్నది. సోలార్​ ప్రాజెక్టు వల్ల నెలకు రూ.2.80 లక్షలు ఆదా కానున్నాయి.