భద్రాచలం, వెలుగు : ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు బలరామావతారంలో దర్శనమిచ్చారు. సుప్రభాత సేవ అనంతరం ఉత్సవమూర్తులకు ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత బేడా మండపంలో స్వామిని బలరామావతారంలో అలంకరించి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత చతుర్వేద విన్నపాలు, నాళాయర దివ్యప్రబంధ పారాయణం జరిగాయి.
బలరామావతార స్వామిని ఊరేగింపుగా మిథిలాప్రాంగణంలోని వేదికపై తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామికి మంగళనీరాజనాలు పలికి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పల్లకీలో బలరామవతార రామయ్యకు తిరువీధి సేవను కనుల పండువగా నిర్వహించారు. కోలాటాలు ఆడుతూ మహిళా భక్తులు పురవీధుల్లో స్వామికి స్వాగతం పలికారు. తాతగుడి సెంటర్లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ తిరువీధి సేవ వైభవంగా సాగింది. అక్కడ పూజలందుకుని స్వామి తిరిగి ఆలయానికి వచ్చారు. ఈవో ఎల్రమాదేవి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.