రాములోరి పాలక మండలికి వేళాయే!

  • భద్రాచలం రామయ్య దేవస్థానం తొలి మండలి ఏర్పాటుకు కసరత్తు
  • 14 మంది సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
  • పోటాపోటీగా దరఖాస్తులు చేసుకుంటున్న ఆశావహులు
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ పెద్దలను కలిసే పనిలో నిమగ్నం

భద్రాచలం, వెలుగు :  తెలంగాణ ఏర్పాటు తర్వాత భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ తొలి పాలకమండలి ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్​ కూడా జారీ చేసింది. 14 మంది సభ్యులను నియమించండగా.. వీరిలో ఒకరిని చైర్మన్​గా ఎన్నుకుంటారు. గత మార్చిలో తొలి నోటిఫికేషన్​ఇచ్చినా అనివార్య కారణాలతో రద్దు అయింది. గత నెలలో మరోసారి నోటిఫికేషన్​జారీ చేయగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

ఎండోమెంట్​డిపార్ట్ మెంట్ ప్రొఫార్మాలో పూర్తి చేసి ఖమ్మంలోని దేవాదాయ అసిస్టెంట్​కమిషనర్​ఆఫీసులో అందించాల్సి ఉండగా.. ఈనెల12 వరకు తుది గడువు ఉంది. ఇప్పటివరకు 20కి పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇంకా పెరిగే చాన్స్ ఉంది. ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు.  మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో కొందరు నేతలు బిజీ అయ్యారు. 

మంత్రుల ఆశీస్సులున్నవారికే..

1959 జూన్​1న భద్రాచలం దేవస్థానం ఎండోమెంట్​ పరిధిలోకి వచ్చింది. అప్పటినుంచి 13 సార్లు పాలకమండళ్లు ఏర్పాటయ్యా యి. ఉమ్మడి ఏపీలో 2012 నవంబరు 13 వరకు చివరి బోర్డు పని చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్​ సర్కారు పదేండ్లలో ఆలయాన్ని పూర్తిగా విస్మరించింది. అభివృద్ధికి పైసా ఇవ్వలేదు. కనీసం బోర్డు ఏర్పాటు కూడా పట్టించుకోలేదు.  కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ అభివృద్ధిపై ఫోకస్​పెట్టింది. ఆలయ అభివృద్ధికి కావాల్సిన భూ సేకరణకు రూ.60.20 కోట్లు విడుదల చేసింది. తాజాగా ట్రస్టు బోర్డును కూడా ఏర్పాటు చేసే కసరత్తు చేపట్టింది.

బోర్డు ఏర్పాటైతే తెలంగాణలో తొలి ట్రస్టు బోర్డు కానుంది. దీంతో నామినేటెడ్ పదవిపై పలువురు ఆశలు పెట్టుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు.  వీరి ఆశీస్సులు ఎవరికైతే ఉంటాయో? వారినే పదవులు వరించే చాన్స్ ఉంది. ఇప్పుడు ఆ ముగ్గురి చుట్టే  నేతలు తిరుగుతున్నారు.

 విచారణ జరిపి నివేదిస్తాం

భద్రాచలం ఆలయ ట్రస్టు బోర్డు సభ్యుల కోసం ఇప్పటివరకు 20 వరకు దరఖాస్తులు వచ్చాయి. చివరి తేదీలోపు వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి, స్క్రూట్నీ చేసి విచారణ​అనంతరం కమిషనర్​కు నివేదిస్తాం  

- ఎం.వీరస్వామి, ఎండోమెంట్​ అసిస్టెంట్​ కమిషనర్, ఖమ్మం