
భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 6న శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, 7న మహా పట్టాభిషేకం నిర్వహించే వేడుకలకు ఏర్పాట్లను ఈనెల 31లోపు పూర్తి చేయాలని భద్రాచలం ఆర్డీవో దామోదర్ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆర్డీవో ఆఫీసులో అధికారులతో కలిసి నిర్వహించిన శ్రీరామనవమి ఏర్పాట్లు రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మిథిలాస్టేడియంలో కల్యాణ మండప ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. ప్రతీ సెక్టార్‌కు ఒక జిల్లా స్థాయి ఆఫీసర్‌ను నియమిస్తున్నట్లు వెల్లడించారు. సెక్టార్లలో బారికేడ్లు పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు. ఆన్లైన్లో భక్తులకు వసతిని బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
శానిటేషన్ సిబ్బందిని నియమించి, వారికి గుర్తింపు కార్డులు ఇస్తామని, టౌన్‌ను 25 జోన్లుగా విభజించి నిత్యం పారిశుధ్య పనులు నిర్వహిస్తామని తెలిపారు. మంచినీటి సరఫరా పర్యవేక్షణకు 30 మంది, నీటి పరీక్షల నిర్వహణకు 12 మందిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. వాహనాల పార్కింగ్, అగ్నిప్రమాదాల నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గోదావరి వద్ద నాటు పడవలు, గజ ఈతగాళ్లు, హెచ్చరిక బోర్డులు ఉంచాలని ఆదేశించారు. ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ భక్తుల రద్దీ నియంత్రణకు మిథిలాస్టేడియంలో కల్యాణ మండపం వద్ద మూడంచెల భద్రతను చేపడుతున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ జామ్ కాకుండా గోదావరి వంతెనల సమీపంలో క్రేన్లను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈవో రమాదేవి మాట్లాడుతూ 25 సమాచార కేంద్రాలు, తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాల కౌంటర్లు 60 చొప్పున పెంచినట్లు తెలిపారు. పోలీసుల సాయంతో మొబైల్ తలంబ్రాల కౌంటర్లు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పర్ణశాల దేవస్థానంలో కూడా ఇదే తరహాలో ఏర్పాట్లు ఉంటాయని వివరించారు.