ప్రభుత్వ పథకాలన్నీ బీఆర్ఎస్సోళ్లకేనా?

  • భద్రాచలం ఆర్డీఓ ఆఫీసును ముట్టడించిన కాంగ్రెస్​నేతలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలన్నీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల జేబుల్లోకే పోతున్నాయని ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆరోపించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ ఆఫీసును ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ మంగీలాల్​కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరయ్య మాట్లాడుతూ.. అర్హులకు దళితబంధు, బీసీలకు రూ.లక్ష సాయం, గృహలక్ష్మి, డబుల్​బెడ్​రూమ్ ఇళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు.

కేసీఆర్​పేదల పొట్టగొట్టి ఎన్నికల వేళ తమ లీడర్లు, కార్యకర్తల జేబులు నింపే పనిలో పడ్డారని విమర్శించారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తెచ్చి పథకాలను తమ క్యాడర్​కు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్​దొంగల ముఠాను తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం కావాలని పొదెం వీరయ్య పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో భద్రాచలం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సరెళ్ల నరేశ్, టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాసరావు, నల్లపు దుర్గాప్రసాద్, నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.