వలస కూలీలకు వల .. భద్రాచలం బస్టాండ్​ అడ్డాగా ముఠాలు

  •  అక్రమంగా మెట్రో సిటీలకు తరలింపు
  • మోసపోతున్న ఆదివాసీలు

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్​ అడ్డాగా అక్రమ మ్యాన్​ పవర్​ కన్సల్టెన్సీలు రెచ్చిపోతున్నాయి. ఛత్తీస్​గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలకు మాయమాటలు చెప్పి దేశంలోని మెట్రో సిటీలకు అక్రమంగా తరలిస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా ఉంటున్నారు. మోసపోయిన ఆదివాసీలు లబోదిబోమంటూ ఆఫీసర్లను ఆశ్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. కూలికి పోయిన వలస ఆదివాసీ మహిళలు అదృశ్యమైన ఘటనలూ ఉన్నాయి. 

పనులు దొరక్క వలస బాట.. 

ఛత్తీస్​గఢ్​, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు పనులు దొరక్క భద్రాచలం వలస వస్తుంటారు. ఇక్కడ మిరప తోటల్లో పని చేస్తుంటారు. కానీ ఈ సంవత్సరం మిరప తోటలు వైరస్ ​సోకి మొత్తం ఎండిపోయాయి. మిరప కోత పనులు దొరకడం లేదు. ఇదే అదనుగా కూలీలను అక్రమంగా తరలించే  ముఠాలు రెచ్చిపోతున్నాయి.  రోజుకు తక్కువ కూలితో, ఎక్కువ గంటలు పనిచేసే ఆదివాసీ కూలీలకు మెట్రో సిటీల్లో డిమాండ్​ ఉంది. అందుకే అవి భద్రాచలంలోని ముఠాలను ఆశ్రయిస్తున్నాయి.

ఎజెన్సీ వాళ్లు లాడ్జిల్లో ఉంటూ ముఠాలకు డబ్బులు ముట్టచెప్పుతూ తమకు అవసరమైన కూలీలను తీసుకుపోతున్నారు. రోజుకు 12 గంటలకు పైగా పనులు చేయించుకుంటారు. ఒక్కో కూలీపై రూ.10వేలు ముందుగానే ముఠా సభ్యులు ఏజెంట్ల వద్ద తీసుకుంటారు. ఇలా ఒప్పందంపై అక్రమంగా తరలిస్తున్నారు. తీరా పని కోసం అక్కడికి వెళ్లిన ఆదివాసీలకు బియ్యం, పప్పులు,కూరగాయలు మాత్రమే ఇచ్చి నెలల తరబడి పనులు చేయించుకుంటారు.

పని అయ్యాక తక్కువ మొత్తంలో కూలి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కూలీలు తిరిగి భద్రాచలం వస్తే ముఠా సభ్యులు దొరకట్లేదు. దీంతో ఆదివాసీలు బిక్కముఖం వేసుకుని ఇళ్లకు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఇటీవల భద్రాచలం నుంచి కర్నూలుకు ఆరుగురు ఆదివాసీలను ముఠా సభ్యులు బోరు పనులకు పంపించారు. అక్కడ కాంట్రాక్టరు భద్రాచలంలో ఉన్న ముఠాకు ఆరుగురి నెల జీతాలు పంపించాడు. కానీ వాళ్లకు ముఠా నాయకులు ముఖం చాటేశారు. చివరకు లోకల్​ పొలిటికల్​ లీడరు ఒకరు ఆదివాసీల డబ్బులు ఇప్పించారు. గార్లబయ్యారం ఇటుక బట్టీలో పనిచేసిన వారికి రూ.1.97లక్షలు కూడా ఇలాగే ఎగ్గొడితే లోకల్​ లీడర్లే ఇప్పించేలా చూశారు. ఇలాంటివి రోజూ జరుగుతూనే ఉన్నా ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవడం లేదు.

అక్రమ మ్యాన్​ సప్లయింగ్​ కేంద్రాలు!

భద్రాచలం కేంద్రంగా 50కిపైగా అక్రమ మ్యాన్​ సప్లయింగ్​ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ఏరియాలో 1/70 తదితర గిరిజన చట్టాలు ఉన్నాయి.. కానీ ముఠాలే స్వయంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. వీరి కోసం తమ ఇళ్ల వద్ద ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసి వారికి భోజనం, కాస్మోటిక్స్ ఆశ చూపించి అక్కడే ఉండేలా చూస్తున్నారు.

అవసరాన్ని బట్టి హైదరాబాద్​, విజయవాడ, బెంగళూరు, కోల్​కత్తా, ముంబై తదితర ప్రాంతాల నుంచి వచ్చే ఏజెంట్లతో ఒప్పందాలు అయ్యాక వారికి తెలియకుండానే వాహనాల్లో పంపించేస్తున్నారు. తాము ముఠా చేతుల్లో మోసపోతున్నామనే విషయాన్నే అమాయక ఆదివాసీలు గ్రహించలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా ఒడిశాలోని మల్కనగిరి, ఛత్తీస్​గఢ్​లోని సుక్మా, బీజాపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాల పరిధిలోని ఆదివాసీల కూలీలు ఇక్కడకు వచ్చి మోసపోతున్నారు.

ఆఫీసర్లు అడ్డుకోవట్లే.. 

వలస కూలీలను మోసగించి, అక్రమంగా ఇతర ప్రాంతాలకు అమ్ముకుంటున్న ముఠాలను అడ్డుకునే సాహసం అధికారులు చేయడం లేదు. ఐటీడీఏ ఉన్నా..  ఆదివాసీలకు మాత్రం న్యాయం దొరకదు. ఆదివాసీల ఆకలితో వ్యాపారం చేసి, వారి శ్రమను దోపిడీ చేస్తున్నా ఒక్క కేసు కూడా పెట్టరు. ఇప్పటికైనా మార్పు రావాలి. 
- తమ్మళ్ల వెంకటేశ్వరరావు, భద్రాచలం

మ్యాన్​ పవర్​ సప్లయింగ్​ కేంద్రాలు లేవు

భద్రాచలంలో మ్యాన్ పవర్​ ​ సప్లయింగ్​ కేంద్రాలు లేవు.  జిల్లా స్థాయి అధికారుల నుంచి అనుమతి ఉంటేనే ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం కుదురుతుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్. ఏజెన్సీ ఏరియాలో ఇలాంటి కేంద్రాలకు అనుమతులు ఇవ్వరు. 
- రవి, లేబర్​ ఆఫీసర్​