భద్రాచలం రెండో బ్రిడ్జి నిర్మాణం అస్తవ్యస్తం!

  •  రూ.100కోట్లతో గోదావరిపై పనులు 
  • అప్రోచ్‍రోడ్డు నిర్మాణంలో కొరవడిన నాణ్యత
  • తొమ్మిదేండ్లైనా ఓ కొలిక్కిరాని వర్క్స్
  • కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక పనుల పరిశీలన
  • శ్రీరామనవమి నాటికి బ్రిడ్జి సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం 
  • హడావుడిగా పనులు కానిస్తున్న ఇంజినీర్లు!

భద్రాచలం, వెలుగు : భద్రాచలం రెండో వంతెన నిర్మాణం అస్తవ్యస్తంగా సాగుతోంది. ఆది నుంచీ ఇక్కడ జరుగుతున్న పనులపై పర్యవేక్షణ లేక నాణ్యత కరువైంది. ఎన్ని లొసుగులు బయటపడినా నేషనల్‍హైవే ఇంజినీర్లు సైతం ‘అబ్బే..  ఏం లేదు’ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా వంతెనకు ఇరువైపులా భద్రాచలం, సారపాకల్లో నిర్మిస్తున్న అప్రోచ్ రోడ్ల పనుల్లోనూ నాణ్యత కొరవడినట్లు తెలుస్తోంది. 

ఇదీ పరిస్థితి.. 

విజయవాడ–-జగదల్‍పూర్‍ నేషనల్​ హైవేలో భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వంతెన నిర్మాణానికి రూ.100కోట్లతో 2015 ఏప్రిల్‍ లో శంకుస్థాపన చేశారు. తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నిర్మాణం ఓ కొలిక్కి రాలేదు. పిల్లర్లు వంకర పోవడం, పిల్లర్లపై వేసే గెడ్డర్లు నాణ్యత లేక కిందపడి పగిలిపోవడం, బిల్లులు చెల్లించక కూలీలు వెళ్లిపోవడం, వాయిదాలు తీసుకుంటున్నందుకు కాంట్రాక్టర్‍కు హైవేస్​ ఫైన్‍ విధించడం..

ఇలా నిర్మాణం భారంగా మారింది. చివరకు హెచ్చరించి తిరిగి అదే రాజ్‍దీప్​ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. బ్రిడ్జి నిర్మాణం చేపడుతూనే మరో వైపు అప్రోచ్‍రోడ్డు పనులు షురూ చేశారు. కానీ పనులు మాత్రం స్లోగానే జరుగుతున్నాయి. 

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక.. 

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్​హెచ్ ​ఇంజినీర్లు, కాంట్రాక్ట్ పొందిన సంస్థతో వరుస సమావేశాలు నిర్వహించారు. పనుల్లో జరుగుతున్న డిలేపై మండిపడ్డారు. పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. వచ్చే శ్రీరామనవమి నాటికి బ్రిడ్జి ఓపెనింగ్​కు సిద్ధం చేయాలంటూ హెచ్చరించారు. దీంతో ఇంజినీర్లు హడావుడిగా పనులు చేస్తున్నారు.. కానీ నాణ్యతను గాలికొదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 

రూల్స్ పాటించట్లే.. 

అప్రోచ్​ రోడ్డు నిర్మాణం చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. గ్రావెల్​ వాడకానికి గైడ్‍లైన్స్ ఉంటాయి. కొత్త రోడ్డు బలంగా ఉండాలంటే ఎర్ర, నల్లమట్టి రెండూ కలిపి పోయాలి. క్యూరింగ్​ చేస్తూ లెవలింగ్‍ చేయాలి. అప్రూవల్ అయిన క్వారీ నుంచి మాత్రమే గ్రావెల్‍ తేవాలి. ఇలా అనేక రూల్స్ ఉన్నాయి. ఇందుకు టెండర్ల సమయంలోనే కాంట్రాక్టర్‍కు గైడ్‍లైన్స్ ఇస్తారు. కానీ ఏ రూల్​ పాటించడం లేదు. మొత్తం తెల్ల రాళ్లతో కూడిన గ్రావెల్‍ను తెచ్చి నింపేస్తున్నారు. ఇటువంటి గ్రావెల్‍తో పోసిన రోడ్డు కుంగిపోయే ప్రమాదం ఉంది.

న్యూ ఫార్మేషన్ రోడ్డు సరిగా లేకపోతే దానిపై పోసే బీటీ రోడ్లు ఎప్పుడూ పాడైపోతుంటాయి. ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జికి సారపాక వైపు ఉన్న రోడ్డు అలాగే ఉంది. కుంగిపోయి బీటీ రోడ్డు వేసినా ఎగుడుదిగుడుగా ఉంటోంది. దీంతో ప్రస్తుతం వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇక్కడే బస్సు బ్రిడ్జి కిందకు బోల్తా కొట్టిన సంఘటనా ఉంది. కనీసం ఇప్పుడు వేసే అప్రోచ్‍ రోడ్డైనా రూల్స్ ప్రకారం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. 

నిబంధనలు పాటిస్తున్నాం

అప్రోచ్​ రోడ్డు నిర్మాణానికి వాడే సాయిల్​టెస్ట్ చేశాం. అప్రూవ్​ అయ్యాకనే పనులు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులు నాణ్యత ప్రకారమే చేస్తున్నాం. నిబంధనలు అన్నీ పాటిస్తున్నాం. 

- శైలజ, డీఈ, నేషనల్​హైవేస్​