భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ నిర్వహించారు. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను మేళాతాళాల మధ్య తీసుకొచ్చి గర్భగుడిలో సుప్రభాత సేవ చేసి, బాలబోగం నివేదించారు. తర్వాత ముత్యాలు పొదిగిన వస్త్రాలను మూలవరులు, ఉత్సవమూర్తులు, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామిలకు అలంకరించి ముత్తంగి సేవ వైభవంగా చేశారు. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామికి ప్రత్యేక హారతులు సమర్పించారు.
బేడా మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరగ్గా, సాయంత్రం దర్బారు సేవను జరిపారు. గుంటూరుకు చెందిన భక్తులు భాష్యం లక్ష్మీ ప్రసన్న, రామకృష్ణ దంపతులు సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.లక్షను విరాళంగా ఈవో రమాదేవికి అందించారు.