
- స్వామి కల్యాణంలో పాల్గొన్న 131 జంటలు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. అనంతరం బంగారు పుష్పాలతో అర్చనను నిర్వహించారు. సుప్రభాత సేవ తర్వాత మూలవరులకు జరిపిన విశేష అభిషేకంలో భక్తులు పాల్గొని అభిషేక జలాలను స్వీకరించారు. స్వర్ణ పుష్పాలతో అర్చన తర్వాత స్వామికి ఇచ్చిన హారతులు కన్నుల పండుగ చేశాయి. కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకెళ్లారు. 131 జంటలు కంకణాలు ధరించి స్వామి నిత్య కల్యాణం నిర్వహించి తరించాయి.
ముందుగా స్వామికి విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచన,ఆరాధన తర్వాత యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక వైభవంగా చేశారు. మంత్రపుష్పం సమర్పించాక క్రతువు ముగిసింది. వీకెండ్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనానికి వచ్చారు. సాయంత్రం దర్బారు సేవ జరగ్గా సీతారాములకు దివిలీ సలాం సమర్పించారు.