స్వర్ణ కవచధారి రామయ్య దర్శనం

స్వర్ణ కవచధారి రామయ్య దర్శనం

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి శుక్రవారం భక్తులకు స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు బంగారు కవచాలు అలంకరించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. బాలబోగం నివేదించారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం నిర్వహించారు. 31 జంటలు ఈ క్రతువులో పాల్గొన్నాయి. 

లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి నివేదనలు ఇచ్చారు. లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చన, విష్ణుసహస్ర పారాయణం జరిగింది. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ అనంతరం అద్దాల మండపంలో సీతారామచంద్రస్వామికి సంధ్యాహారతిని ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
 

భద్రాద్రికి చేరుకుంటున్న హనుమత్ దీక్షాపరులు
 

భద్రాద్రికి హనుమత్ దీక్షాపరులు భారీగా తరలివస్తున్నారు. హనుమత్​ జయంతి సందర్భంగా శనివారం రామాలయంలో దీక్షలను విరమించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న దీక్షాపరులతో ఆలయం కిటకిటలాడుతోంది. సెలవు దినాలు కావడంతో ఒకవైపు భక్తులు, హనుమత్​ జయంతి సందర్భంగా దీక్షాపరుల రాకతో భద్రాచలంలో లాడ్జిల్లో గదులు దొరకని పరిస్థితి నెలకొంది. దేవస్థానం తగిన ఏర్పాట్లు చేస్తోంది.