భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీ దళాలతో అర్చన జరిగింది. ఉదయం సుప్రభాత సేవ తర్వాత స్వామికి బాలబోగం నివేదించారు. అనంతరం బంగారు తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. భద్రుని మండపంలో రామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. బేడా మండపంలో జరిగిన నిత్య కల్యాణంలో 49 జంటలు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నాయి.
మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజభోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. ఏపీ హైకోర్టు జడ్జి ఏవీ రవీంద్ర, ఛత్తీస్గఢ్ సీఆర్పీఎఫ్ డీఐజీ సూరాజ్పాల్ వర్మ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మంకు చెందిన భాస్కర్ అనే భక్తుడు శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1లక్ష, హైదరాబాద్ప్రగతినగర్కు చెందిన ఆర్.పద్మనాథరావు దంపతులు రూ.50వేలు విరాళంగా అందజేశారు.