విధులు బాధ్యతగా నిర్వహించాలి : ఎండోమెంట్ కమిషనర్​ శ్రీధర్​

విధులు బాధ్యతగా నిర్వహించాలి : ఎండోమెంట్ కమిషనర్​ శ్రీధర్​
  • శ్రీరామనవమి ఏర్పాట్ల రివ్యూ 

భద్రాచలం, వెలుగు :  శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం ఉత్సవాల నిర్వహణకు అప్పగించిన విధులను బాధ్యతగా నిర్వహించాలని  ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్​ సూచించారు. భద్రాచలం ఆర్డీవో ఆఫీసులో కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఆఫీసర్ల రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. భద్రాద్రికి, పర్ణశాలకు భక్తులు ఈసారి ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో వస్తారని, ఏర్పాట్లు పక్కాగాఉండాలని ఆదేశించారు.

ఇప్పటికీ  కొన్ని పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్​ 4న అన్ని శాఖలు తాము కల్పించిన సదుపాయాలపై ట్రయల్​ రన్​ నిర్వహించుకోవాలని సూచించారు. సీఎం రేవంత్​రెడ్డి, ఇతర వీవీఐపీలు, వీఐపీలు వస్తున్నందున భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఫైర్​, పోలీస్​, రెవెన్యూ, పంచాయతీ, ఆర్​డబ్ల్యూఎస్​ఈ శాఖలు అలర్ట్ గా ఉండాలని తెలిపారు. కలెక్టర్​ జితేశ్​ మాట్లాడుతూ భక్తులకు 75 శాతం టిక్కెట్లు ఆన్​లైన్​లో ఉంచామన్నారు.

తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలు ఇవ్వడానికి యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేశామని తెలిపారు. సీఎం రాక కోసం మూడు హెలీప్యాడ్​లు సిద్ధం చేశామన్నారు. మిథిలాస్టేడియం వద్ద నాలుగు ఫైరింజన్లు, ఆరోగ్యశాఖ ద్వారా 13 మెడికల్​ క్యాంపులు, 5 అంబులెన్సులు, 30 మంది ఫీల్డ్ స్టాఫ్​, ఏరియా ఆస్పత్రిలో  24 గంటలు పనిచేసే ప్రత్యేక వార్డు, మందులు, ఓఆర్​ఎస్​ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. 6,7 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సిబ్బంది ఎవరైనా  న్యూసెన్స్  సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో అడిషనల్​ కలెక్టఱ్​ వేణుగోపాల్, ఐటీడీఏ పీవో రాహుల్, ఈవో రమాదేవి, ఏఎస్పీ విక్రాంత్​కుమార్​ సింగ్, ఆర్డీవో దామోదర్​ పాల్గొన్నారు.