భద్రాద్రిలో నిత్య కల్యాణాలు షురూ

భద్రాచలం,వెలుగు :  శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో పగల్​ పత్​ ఉత్సవాల సందర్భంగా నిలిపేసిన నిత్య కల్యాణాలు ఆదివారం నుంచి షురూ అయ్యాయి. ముందుగా మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేసి భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. అనంతరం బంగారు పుష్పాలతో సీతారాములకు అర్చన చేశారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం నిర్వహించారు.

134 జంటలు కంకణాలు ధరించి ఈ క్రతువును నిర్వహించాయి. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం ఆరాధన, యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం సమర్పించడంతో క్రతువు ముగిసింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం దర్బారు సేవ అనంతరం సీతారామచంద్రస్వామికి రాపత్​సేవ అంబసత్రంలో హరిదాస మండపంలో వైభవంగా నిర్వహించారు.