
- భూసేకరణకు రూ.34కోట్లను రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధికి లైన్ క్లియర్ అయ్యింది. ఆలయం చుట్టూ ఉన్న భూమిని సేకరించేందుకు రెవెన్యూశాఖ ద్వారా ఇప్పటికే ఇళ్ల యజమానులతో మాట్లాడి వారి నుంచి అంగీకారం తీసుకుని కలెక్టర్ జితేశ్వి పాటిల్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. గతంలో జీవో నెంబర్ 246 ద్వారా రూ.60.20కోట్ల ఎస్డీఎఫ్నిధులు ఇచ్చిన సంగతి విదితమే. కలెక్టర్ నివేదిక ప్రకారం ప్రభుత్వం రూ.34కోట్లను జీవోను విడుదల చేస్తూ జీవో నెంబర్ 93ను రిలీజ్ చేసింది.
మరో రెండు మూడు రోజల్లో 45 ఇండ్ల చెందిన యజమానులకు పరిహారం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్డీవో వెల్లడించారు. ఆలయం చుట్టూ ఉన్న భూ నిర్వాసితులతో ఆర్డీవో దామోదర్ మంగళవారం తన చాంబరులో మీటింగ్ నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందరికీ ఇస్తామని సూచించారు. కాగా పరిహారం తీసుకునేందుకు అంగీకరించిన ఇండ్ల యజమానులు ఖాళీ చేసేందుకు కొంత సమయం కావాలన్నారు.
సీఎంతో భేటీతో కదలిక
ఇటీవల శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించేందుకు హైదరాబాద్‌కు ఈవో రమాదేవి, వైదిక బృందం వెళ్లారు. ఆహ్వానపత్రిక తీసుకున్నాక ఆలయ అభివృద్ధి గురించి ఆయన చర్చించారు. భూసేకరణ వివరాలు సీఎంకు వివరించగా నివేదికలు పరిశీలించేందుకు మరుసటి రోజు రావాలని ఆదేశించారు. ఈవో రమాదేవి పూర్తి వివరాలతో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్ తో పాటు సీఎంను కలిశారు. ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి రూ.34కోట్లను రిలీజ్ చేశారు. కాగా, భూసేకరణలో భాగంగా నిర్వాసితులకు ఇచ్చేందుకు నిధులు మంజూరయ్యాయి. శ్రీరామనవమికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొస్తున్న సీఎం రేవంత్ రెడ్డితో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజను చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.