
తెలంగాణలోని పవిత్ర క్షేత్రంగా పేరుగాంచిన భద్రాచలం, దక్షిణ అయోధ్యగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున లక్షలాది మంది భక్తులు శ్రీరాముని కల్యాణ మహోత్సవాన్ని దర్శించేందుకు వస్తారు. ఇది భక్తి, ఆధ్యాత్మికత, చరిత్రతో నిండిన పుణ్యక్షేత్రం.కాని 2014లో రాష్ట్ర విభజన తరువాత, భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలు పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యాయి. దాంతో భద్రాచలం ఆలయానికి చెందిన భూములపై నియంత్రణ కోల్పోయింది. అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.
పార్కింగ్, అతిథి గృహాలు, పార్కులు వంటి ప్రాథమిక అవసరాలకే భూమి లేకుండా పోయింది. చుట్టు పక్కల పుణ్యక్షేత్రాలను సందర్శించాలంటే ఏపీ గ్రామాల ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి. ఆ ఐదు గ్రామాల ప్రజలు ఇప్పటికీ భద్రాచలాన్ని నమ్మి జీవిస్తున్నారు. కానీ పరిపాలన పరంగా ఏపీకి వెళ్లిపోయారు. ప్రభుత్వ పనుల కోసం 450 కిలోమీటర్ల దూరంలోని పాడేరు వెళ్లాల్సి వస్తోంది. గత 10 ఏళ్లుగా తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నా మార్పేమీ కనిపించడం లేదు. భద్రాచలం ఒక ఆలయం మాత్రమే కాదు అది కోట్లాది మంది భక్తుల మనసులో ఉండే ఒక భావోద్వేగం.