ఇంకా పూర్తికాని భద్రాచలం-విజయవాడ హైవే పనులు

2015లో ప్రారంభమైన భద్రాచలం-విజయవాడ హైవే పనులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం– విజయవాడ నేషనల్ హైవే పనులు ఏడేండ్లయినా పూర్తి కాలేదు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి రుద్రంపూర్​నుంచి పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపహడ్​ల మీదుగా జిల్లాలో సుమారు 

50కి.మీ హైవే నిర్మించనున్నారు. దీని కోసం రూ.220 కోట్లు కేటాయించారు. అయితే హైవే పనులు ఏడేండ్లుగా సాగుతూనే ఉన్నాయి.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్​ తర్వాత నిర్మాణ ఖర్చు పెరగడంతో ఎస్టిమేషన్​పెంచాలని ఉద్దేశంతో కాంట్రాక్టర్​హైవే నిర్మాణంలో జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

2015లో స్టార్ట్ అయిన పనులు

జిల్లాలో రుద్రంపూర్​నుంచి భద్రాచలం వరకు 2015లో ఈ హైవే పనులు ప్రారంభించారు. నాలుగేండ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొదట్లో కొంత స్పీడ్​గా పనులు చేసిన కాంట్రాక్టర్​ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో పనుల్లో వేగం తగ్గింది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో పనులు స్లోగా నడుస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రామవరం, సింగరేణి హెడ్డాఫీస్​, పోస్టాఫీస్​ సెంటర్ల, మున్సిపాలిటీ ప్రాంతాల్లో డ్రైనేజీలు అసంపూర్తిగా నిర్మించడంతో మురుగునీరు నిల్వ ఉండి దోమలు పెరుగుతున్నాయి. మరో వైపు రోడ్డు పక్కన నిర్మిస్తున్న ఫుట్​ పాత్​లు అసంపూర్తిగా ఉండడంతో పాదచారులకు అవస్థలు తప్పడం లేదు. ఏళ్లకొద్దీ పనులు సాగుతుండడం, పనుల్లో క్వాలిటీ లేకపోవడంతో వర్క్స్​ పూర్తి కాకుండానే రోడ్డు శిథిలావస్థకు చేరుతోంది. అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్లర్లు ఇష్టారీతిన పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రామవరం, శ్రీనగర్​ ప్రాంతాల్లో బ్రిడ్జిలను అసంపూర్తిగా వదిలేశారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపై నుంచి వరద నీరు రోడ్డు డ్రైనేజీలలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఇల్లందు క్రాస్​ రోడ్డు వద్ద జంక్షన్​ పనులు ఏడాదిన్నరగా అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పనులను స్పీడప్​చేయాలని జరిగిన మీటింగ్​లలో కలెక్టర్​ అధికారులు, కాంట్రాక్టర్లను పలుమార్లు ఆదేశించినా వారిలో చలనం కనిపించడం లేదు. కొవిడ్​తర్వాత నిర్మాణ వ్యయం పెరగడంతో కాంట్రాక్టర్​ పనులు చేయడంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మాట నిజమేనని నేషనల్​ హైవే అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టర్​ అందుబాటులో లేరని, పనులను చేయించేందుకు కృషి చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.