
- రూ.1.41కోట్లతో చేపట్టబోయే పనులకు టెండర్లు ఖరారు
- భక్తులకు వసతులు కల్పించేందుకు దేవస్థానం కార్యాచరణ
భద్రాచలం,వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో రానున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పనులకు టెండర్లు ఖరారయ్యాయి. దేవాదాయ కమిషనర్ఆమోదం మేరకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. గురువారం ఈవో రమాదేవి, ఈఈ వేగిశ్న రవీందర్రాజు రూ.1.41కోట్లతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
వచ్చే నెల 5న ఎదుర్కోలు ఉత్సవం, 6న మిథిలాస్టేడియంలో సీతారాముల కల్యాణం, 7న శ్రీరామపట్టాభిషేకం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు శ్రీరామ కల్యాణ వేడుకలు చూసేందుకు భారీగా తరలివస్తారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం కార్యాచరణ రూపొందించింది. కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని పనులను వెంటనే ప్రారంభించేందుకు దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం సన్నాహాలు చేస్తోంది.
భక్తులతో సందడి
హోలీ వేళ భద్రాచలం దేవస్థానంలో శుక్రవారం నిర్వహించబోయే వసంతోత్సవం, డోలోత్సవానికి సాయంత్రం అంకురార్పణ జరిగింది. గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చిన అర్చకులు యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఉదయం బేడా మండపంలో సీతారామచంద్రస్వామికి నిత్య కల్యాణం నిర్వహించారు.
భక్తులు క్రతువులో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దీంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. అర్చకుల ఆగ్రహంఆరేండ్లకోసారి ఆలయంలో నిర్వహించే డోలీ పౌర్ణమి ఉత్సవాలకు యాజ్ఞిక బ్రహ్మగా వ్యవహించేందుకు ఈసారి ఉప ప్రధానార్చకుడు అమరవాది రామానుజాచార్యులుకు చాన్స్ వచ్చింది.
అయితే.. ఇటీవల ఆయనను ఈవో రమాదేవి పర్ణశాల దేవస్థానానికి బదిలీ చేశారు. దీంతో ఆయన రాలేని పరిస్థితి తలెత్తింది. కాగా.. రామానుజాచార్యులు రావాల్సిందేనని అర్చకులు పట్టుబట్టారు. ఆయన లేకుండా నిర్వహించలేమని అర్చకులంతా భీష్మించడంతో ఈవో దిగొచ్చారు. ఆలస్యంగా డోలీ పౌర్ణమి అంకురార్పణ వేడుకలు జరిగాయి.