భద్రాచలం, వెలుగు: మావోయిస్ట్ పార్టీ అల్లూరి సీతారామరాజు భద్రాద్రికొత్తగూడెం ఏరియా కమిటీ సభ్యుడు మడకం కోనయ్య అలియాస్ సుఖ్ రాంను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల మండలం పూసుగుప్ప– చర్ల మార్గంలో శుక్రవారం పోలీసులు, సీఆర్ పీఎఫ్ జవాన్లు తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో అటువైపు వచ్చిన కోనయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఐదు కిలోల మందుపాతరను స్వాధీనం చేసుకున్నారు. చర్ల మండలం కొండవాయికి చెందిన కోనయ్య 2018లో మావోయిస్ట్ పార్టీలో చేరారు. తర్వాత చర్ల ప్లాటూన్ సభ్యుడిగా, టెక్నికల్డిపార్ట్ మెంట్ లో అప్పాసి నారాయణకు గార్డ్ గా పనిచేశారు. తర్వాత 2024లో అల్లూరి సీతారామరాజు- భద్రాద్రికొత్తగూడెం ఏరియా కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. కోనయ్యపై రూ. 4 లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు. తెలంగాణ, చత్తీస్ గఢ్ లో జరిగిన 50 హింసాత్మక ఘటనల్లో కోనయ్య కీలక నిందితుడు. ఎస్పీ వెంట ఓఎస్డీ సాయిమనోహర్, చర్ల సీఐ రాజువర్మ ఉన్నారు.